సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో బ్యుటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి వెనుక ప్రభాకర్ పాత్ర ఉందేమోననే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. శిరీష, ఆమె స్నేహితులు రాజీవ్, శ్రవణ్‌లు ఆదివారం నాడు కుకునూరుపల్లికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ అందరూ కలిసి విందు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సందర్భంగా శిరీషతో ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.
దీంతో మనస్తాపానికి గురై శిరీష హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహరంపై శిరీష స్నేహితులు రాజీవ్, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుందన్న ఉద్దేశంతోనే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరపాలని అదనపు డీజీ గోపీకృష్ణ, హైదరాబాద్ ఐజీ స్టీఫెన్ రవీంద్రను డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశించారు.
మరోవైపు శిరీషకు, ప్రభాకర్ ఘటనకు సంబంధం ఉందంటూ పోలీసులు చేస్తోన్న ఆరోపణలపై శిరీష భర్త సతీశ్ చంద్ర స్పందించారు. తన భార్య మృతిపై గంటకో విషయం బయటకు వస్తోందని ఆవేదన చెందారు. పోలీసులు చెబుతున్న కుకునూరు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఎవరో తనకు అసలు తెలియదని అన్నారు. అయితే గ్రామస్తులు మాత్రం ఉన్నతాధికారుల వేధింపులవల్లే ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.
గతంలో ఇదే పోలీస్టేషన్లో 2016 ఆగస్టులో రామకృష్ణారెడ్డి అనే ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడు. రామకృష్ణారెడ్డి స్థానంలో ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న గదిలోనే ప్రభాకర్‌రెడ్డి రివాల్వర్‌తో కాల్చుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రభాకర్‌రెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా ఆలేరు మండలం టంగుటూరు.అయనకు భార్య, రెండు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. 2012 బ్యాచ్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి గతంలో మల్కాజ్ గిరి, శామీర్ పేట, కౌడిపల్లిలో పనిచేశారు.