మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాటు చేసిన ఆయుధ కర్మాగారాన్ని భద్రతా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. గుప్త సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, సీఆర్పీఎఫ్ మరియు డీఆర్‌జీ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఈ కీలక విజయం సాధించారు.
అటవీ లోతుల్లో దాగి ఉన్న ఈ ఆయుధ తయారీ కేంద్రంలో భారీగా పేలుడు పదార్థాలు, దేశీ తుపాకులు, బాంబుల తయారీకి ఉపయోగించే సామాగ్రి, డిటోనేటర్లు, వైర్లు, గన్ పౌడర్, ఐఈడీ భాగాలు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు బాంబుల తయారీకి పన్నిన కుట్రను ఈ ఆపరేషన్‌తో భగ్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు ప్రమాదకరంగా ఉండటంతో వాటిని అదే ప్రాంతంలో నియంత్రిత విధానంలో పేల్చివేశామని పోలీసులు తెలిపారు. ఈ చర్యతో స్థానిక గ్రామాలకు మరియు భద్రతా సిబ్బందికి ఉన్న ప్రమాదం పూర్తిగా తొలగిందని పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా దళాల దాడులు మరింత ఉధృతమయ్యాయి. వరుస ఆపరేషన్లతో వారి సరఫరా మార్గాలు, ఆయుధ నిల్వలు ధ్వంసమవుతున్నాయి. ఈ ఘటన మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి దెబ్బగా మారిందని, శాంతిభద్రతల పరిరక్షణలో ఇది కీలక ముందడుగని భద్రతా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read:Epstein files:మళ్లీ ట్రంప్ పోటో ప్రత్యక్షం

