నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో పొరపాట్లు చేసి బీజేపీకి అనవసరంగా అవకాశం ఇచ్చామని, కాని సాగర్‌లో మాత్రం ఎటువంటి అలసత్వానికి తావు ఇవ్వకూడదని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యారంట..అందుకే సాగర్ ఉప ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా సరికొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. సాగర్‌లో బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వరాదని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఓ స్ట్రాటజీ ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకుండా గోప్యత పాటిస్తున్నారని సమాచారం. సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి, స్థానికంగా బలమైన మరో నేత ఎంసీ కోటిరెడ్డి, దివంగత ఎమ్మెల్యే నోముల కుమారుడు భరత్, నోములకు దగ్గరి బంధువైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి.
వీరిలో నోముల భరత్‌కు పార్టీ పరంగా నామినేటేడ్ పదవి కట్టబెట్టి సాగర్‌లో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం తన క్లాస్‌మేట్ అయిన ఎంసీ కోటిరెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది కాని..సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థులుగా తేరా చిన్నపురెడ్డి, బాలరాజు యాదవ్‌ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన మరుక్షణమే టికెట్ దక్కని నేతలకు కాషాయ కండువా కప్పి ఎన్నికలలో పోటీ చేయించేందుకు బండి సంజయ్ సిద్ధంగా ఉన్నాడనే సమాచారంతో… సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో ప్రకటించి బీజేపీకి షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారంట..కాగా మరోవైపు సాగర్‌లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్ ఉప ఎన్నికలలో అమలు చేసిన గేమ్ ప్లాన్‌ను ఫాలో అవ్వాలని భావిస్తున్నారంట..
ఈ మేరకు సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ మండలాల వారిగా ఇన్‌చార్జీలను నియమించింది. మండలానికి ఓ ఎమ్మెల్యేను ఇన్‌చార్జీగా నియమించింది. గతంలో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కూడా మండలానికి ఓ ఎమ్మెల్యేను లేదా ఎమ్మెల్సీని నియమించడమే కాకుండా గ్రామాలవారీగా ఇంచార్జిలను నియమించి కాంగ్రెస్ పార్టీని ఖంగుతినిపించారు. ఇదే వ్యూహాన్ని ఇప్పుడు సాగర్ లోనూ ఫాలో కానున్నారు. ఈక్రమంలో తిరుమలగిరి మండలానికి దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, అనుముల మండలానికి రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్, పెద్దవూరకు చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్, గుర్రంపోడ్ కు నల్లగొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి, నిడమనూరుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, త్రిపురారం మండలానికి మహాబుబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్ నాయక్, హాలియా మున్సిపాలిటీకి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సాగర్ మునిసిపాలిటీకి కరీంనగర్ మేయర్ సునీల్ రావును నియమించారు. వీరంతా ఆయా మండల, మున్సిపల్ కేంద్రాల్లోని ఉండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాల్సి ఉంది. ఈ ఎమ్మెల్యేలంతా తమకు కేటాయించిన మండలాల పరిధిలో ఇప్పటి నుంచే పని మొదలు పెట్టబోతున్నారు. ఎన్నికలలో ప్రత్యర్థుల బలాలు, బలహీనతలను దృష్టిలో పెట్టుకుని ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేయడం, నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సామాజికవర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకుని, టీఆర్ఎస్ జెండా ఎగిరేలా వ్యూహాలను అనుకున్నట్లుగా అమలు చేయడం వంటి పనులను ఎమ్మెల్యేలంతా నిర్వర్తిస్తారు. మొత్తంగా ఉప ఎన్నికలలో గెలిచి..కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సరికొత్త గేమ్ ప్లాన్ రచిస్తున్నారని, ఇక సాగర్‌లో బండి సంజయ్‌కు సీన్ రివర్స్ అవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

