అక్రమాయుధాల కేసులో సల్మాన్‌కు ఊరట

137
Another Relief for Salman Khan

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు మరో బిగ్ రిలీఫ్ లభించింది. హిట్ అండ్ రన్ కేసు నుంచి విముక్కి పొందిన సల్మాన్‌  తాజాగా అక్రమ ఆయుధాల కేసు నుంచి కూడా బయటపడ్డారు. సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటిస్తు జోధ్ పూర్ కోర్టు తీర్పు వెలువరించింది. సాక్ష్యాలను చూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. రాజస్థాన్ అటవీ శాఖ అధికారులు కూడా సరైన సాక్ష్యాలను అందించలేదని చెప్పారు. తీర్పు వెలువరించే సమయంలో సల్మాన్ కూడా కోర్టులోనే కూర్చుని ఉన్నారు. కోర్టు తీర్పుతో సల్మాన్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

దాదాపు 18 ఏళ్ల క్రితం కృష్ణ జింకలను వేటాడిన కేసుకు అనుబంధంగా ఆయనపై అక్రమాయుధాల కేసును నమోదు చేశారు. అప్పట్లో ఒక సినిమా షూటింగ్‌ నిమిత్త జోధ్‌పూర్‌ వచ్చిన సల్మాన్‌ తన సహనటుడు సైఫ్‌ అలీఖాన్‌, టబూ, నీలమ్‌, సోనాలి బెంద్రెలతో కలిసి కృష్ణ జింకలను, చింకారాలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి సల్మాన్‌ పలు కేసులను ఎదుర్కొన్నాడు. ఇప్పటికే ఈ కేసుకు సంబందించి ఏప్రిల్ 2006 లో ఒకసారి తరువాత ఆగస్టు 2007 కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించాడు సల్మాన్.

తర్వాత రాజస్థాన్‌ హైకోర్టు వీటిని కొట్టేయడంతో ప్రభుత్వం సుప్రీంలో దీనిని సవాలు చేసింది. దీనికి ఎటువంటి ఆధారాలు లేవని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. సల్మాన్‌ వద్ద ఆ సమయంలో కేవలం ఎయిర్‌గన్‌ మాత్రమే ఉందని కోర్టుకు తెలిపారు.దీంతో సల్మాన్ లాయర్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తు తీర్పు వెలువరించారు.