మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం..

34
ktr

పరిశ్రమలు ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావుకి మరొక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించనున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సు 2021 కి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పలికింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 5 నుంచి 7వ తేదీ వరకు జపాన్‌లోని టోక్యో నగరంలో ఈ సదస్సు జరుగుతుంది. వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలతో పాటు మంత్రులు, వ్యాపార, వాణిజ్య రంగాల్లోని ప్రముఖులు ఈ సదస్సులో భాగస్వాములు కానున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కోవిడ్ సంక్షోభం అనంతరం దేశాలు తిరిగి వృద్ధి బాట పట్టేందుకు ఎమర్జింగ్ టెక్నాలజీల వినియోగం అనే ప్రధాన అంశం పైన ఈ సదస్సు జరగనుంది.

4వ  పారిశ్రామిక విప్లవంలో ఈ నూతన టెక్నాలజీల వినియోగం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య లను మరింతగా ముందుకు తీసుకెళ్లే అంశంతో పాటు ఆయా టెక్నాలజీల పరిమితులను ఏవిధంగా అధిగమిస్తూ వృద్ధిని వేగవంతం చేయడం.. ఈ రంగాల్లో ఇన్నోవేషన్‌ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయంలోనూ ఈ సదస్సులో చర్చించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక లబ్ధికోసం ఏవిధంగా ఉపయోగించాలనే విషయంలో కేటీఆర్ నాయకత్వంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారని వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంత్రి కేటీఆర్ కి పంపిన లేఖలో ప్రశంసలు కురిపించింది.

ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు పంపిన ప్రత్యేక లేఖలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్గ్ బ్రండే కేటీఆర్‌ను ప్రశంసించారు. ఎఐ4ఏఐ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్, జీ-20 స్మార్ట్ సిటీస్ అలయన్స్ వంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేపట్టిన కార్యక్రమాలకు సైతం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మద్దతు పట్ల ఫోరం ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఫోరం తెలిపింది. జపాన్‌లో నిర్వహించనున్న గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సుకు మంత్రి కేటీఆర్ రావడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ వేదికపై ఎమర్జింగ్ టెక్నాలజీస్ రంగంలో మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని ఫోరం మంత్రికి పంపిన లేఖలో తెలిపింది.