రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ కు మరోసారి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. 2020లో స్విజర్లాండ్లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 50వ సదస్సుకు మంత్రి కేటీ రామారావును ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్జ్ బ్రెండే(Borge Brende) ఆహ్వానం పంపించారు. వచ్చే సంవత్సరం జనవరిలో 21 నుంచి 24 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనుంది. గత 50సంవత్సరాలుగా ప్రపంచంలోని ప్రైవేటు వ్యాపార, వాణిజ్య రంగంలోని ప్రముఖ సంస్థలతో ప్రభుత్వ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కీలకపాత్ర పోషిస్తుందని, ఈసారి జరగనున్న సమావేశానికి సైతం ప్రపంచంలోని కీలక సంస్థల ప్రతినిధులతో పాటు, ప్రభుత్వాధినేతలు, మరియు కేంద్ర స్ధాయి మంత్రులను అహ్వనిస్తున్నట్లు అధ్యక్షుడు బోర్జ్, మంత్రి కెటియార్ కు పంపిన లేఖలో పేర్కొన్నారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అనేక వినూత్న కార్యక్రమాలు, పథకాలతో ముందుకు వెళుతుందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో అగ్రభాగాన ఉన్నదని తెలిపారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో మంత్రి కేటీఆర్ నాయకత్వంలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షించాయని, ఈ నేపథ్యంలో నాలుగవ పారిశ్రామిక విప్లవంలో టెక్నాలజీ ప్రయోజనాలు ఎదురయ్యే సవాళ్లను తగ్గించడం అనే అంశం పైన చర్చించాల్సిదిగా మంత్రి కేటీఆర్ ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోరింది. దీంతోపాటు వివిధ అంశాలపైన జరిగే చర్చల్లోనూ తెలంగాణ ప్రభుత్వ అనుభవాలను వివరించాల్సిందిగా మంత్రికి పంపిన లేఖలో విజ్ఞప్తి చేసింది.