మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది ఢిల్లీలోని ఓ హిందు కుటుంబం. రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇందు ఏర్పాటు చేసింది. అయితే ఇందులో ఏముంది పెద్ద విశేషం అనుకుంటున్నారా.. తన ఒక్కగానొక్క కొడుకు ముస్లిం యువతిని ప్రేమించాడనే కారణంతో ఆ యువకుడిని ఆ యువతి కుటుంబ సభ్యులు హత్య చేశారు. అయితే ఆ మతంపై నాకు ఎలాంటి కోపం లేదని, కేవలం నా కొడుకుని చంపిన వ్యక్తులకు మాత్రమే ఉరి శిక్ష పడాలని కోరాడు తండ్రి యశ్ పాల్.
శాంతిని పెంపొందిండమే తన లక్ష్యమని ఆ యువకుడి తండ్రి యశ్ పాల్ అన్నారు. అయితే ఐదు నెలల క్రితం ఈ అంకిత్ అనే యువకుడి హత్య ఢిల్లీలో పెద్ద సంచలనమే సృష్టించింది. 23 ఏళ్ల అంకిత్ హత్యను పోలీసులు పరువు హత్యగా దృవీకరించారు. ఈ నేపథ్యంలో తండ్రి యశ్ పాల్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడంతో పలువురు ప్రశంసిస్తున్నారు.
కొడుకు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు, తన స్నేహితుడు మహమ్మద్ ఇజార్ ఆలం మాటలతో ఊరట కల్పించారని యశ్‌పాల్ వ్యాఖ్యానించారు. ఇక తన మనసులో ఉన్న ఇఫ్తార్ విందు విషయం గురించి తనతో పంచుకోగా అన్ని విధాల సహాయంగా ఉంటానని హామీ ఇచ్చారని తెలిపారు. తన కుమారుడు అంకిత్ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇరుగు-పొరుగు హిందు-ముస్లింలతో పాటు మాజీ ఐపీఎల్ అధికారి హర్ష్ మందార్, గోరఖ్ పూర్ డాక్టర్ కఫీల్ ఖాన్ హాజరయ్యారు.