ఎప్రిల్ లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఏపీలో ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు ప్రచారాలు ప్రారంభించాయి. వైసిపి, జనసేన పార్టీల నేతలు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కష్టపడుతున్నారు. ఇటివలే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ లు కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ పూర్తిగా విఫలం చెందడంతో ఏపీలో కూడా ఇద్దరు కలిసి పోటీ చేస్తారా లేదా విడి విడిగా పోటీ చేస్తారా అనే అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ఈ సందేహాలకు తాజాగా కాంగ్రెస్ పార్టీ తెరదించింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తెలిపారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమన్ చాందీ. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ, 25పార్లమెంట్ స్ధానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తునట్లు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెలలో బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఎన్నికల కార్యాచరణను రూపొందించడానికి ఈనెల 31న మరోసారి భేటీ అవుతామని చెప్పారు. ఈనెలలోనే ఎన్నికల కమిటీకి సంబంధించిన నివేదికను అధిష్టానానికి పంపుతామని తెలిపారు.