ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. టీడీపీ తరపున అచ్చెన్నాయుడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాంని కోరారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా త్వరగా ముగించమని స్పీకర్ సూచించారు.
దీంతో తాను సబ్జెక్టుకే వస్తున్నా.. లేదంటే మీరు రాసివ్వండి నేను చదివేస్తా అని అచ్చెన్నాయుడు అనడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సభనా అంగడి బజారా అని మండిపడ్డ స్పీకర్ మీరు చెప్పండి నేనే చదువుతాను..ఏం మాట్లాడుతున్నారు అంటూ అచ్చెన్నాయుడిపై మండిపడ్డారు. ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సభ నడపడం చాలా కష్టమవుతుందని వ్యాఖ్యానించారు.
ఇక మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం అచ్చెన్నాయుడి ప్రవర్తనపై విమర్శలు గుప్పించారు. అచ్చెన్నాయుడు సభ సంప్రదాయాలు మర్చిపోయారని ..స్పీకర్‌ను కూడా బెదిరించేలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. మొత్తంగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.