రాజకీయ నిరసనల్లో మూగజీవాలను వాడుకోవడంపై ప్రముఖ యాంకర్, జంతు ప్రేమికురాలు రష్మీ గౌతమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో వైసీపీ నాయకులు చేపట్టిన ఒక నిరసన కార్యక్రమంలో ఎద్దు పట్ల ప్రదర్శించిన తీరుపై ఆమె సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.
పెరిగిన ఇంధన ధరలకు నిరసనగా తిరుపతిలో వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక వినూత్న నిరసన చేపట్టారు.ఒక ఎడ్లబండిపై ఏకంగా ఒక ఆటోను, దానితో పాటు కొంతమంది మనుషులను ఎక్కించి ఊరేగింపుగా వెళ్లారు.
ఆటో బరువు, పదుల సంఖ్యలో మనుషుల భారాన్ని మోయలేక ఆ మూగజీవం తీవ్రంగా ఇబ్బంది పడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.జంతువుల హక్కుల కోసం నిరంతరం పోరాడే రష్మీ, ఈ ఘటనపై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆ మూగజీవం పడ్డ ఆవేదన, కష్టం.. ఈ మనుషులపై వెయ్యి రెట్లు ఎక్కువగా పడాలి. రాజకీయ ప్రచారం కోసం జంతువులను హింసించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. కేవలం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read:ఆర్‌అండ్‌బీ టెండర్లలో అవినీతి:హరీష్
ఈ ఘటనపై తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరియు పెటా సంస్థలను ఆమె కోరారు. మూగజీవాల పట్ల జరుగుతున్న ఇటువంటి క్రూరత్వానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె సూటిగా ప్రశ్నించారు.ఈ అంశంపై నెటిజన్లు కూడా రెండుగా చీలిపోయారు. రష్మీ వ్యాఖ్యలకు జంతు ప్రేమికులు మద్దతు తెలుపుతుండగా, నిరసనలో జంతువులను వాడటం పాత పద్ధతే కదా అని మరికొందరు వాదిస్తున్నారు. అయితే, శక్తికి మించిన బరువును ఎద్దుపై వేయడం మాత్రం తప్పేనని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

