మరోసారి ఈ తప్పు చేయను..:ప్రదీప్

190
- Advertisement -

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పోలీస్ కౌన్సిలింగ్‌కు హాజరుకాలేకపోయానని యాంకర్ ప్రదీప్ తెలిపారు. కౌన్సిలింగ్‌ హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రదీప్.. ఈ రోజు కౌన్సెలింగ్‌ సెషన్‌కు హాజరు కావాలని మెసేజ్‌ వచ్చింది. అందుకే వచ్చాను.  పోలీసులు విధించిన నిబంధనలను ఫాలో అవుతున్నా. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపారు.మరోసారి ఈ తప్పు చేయనని తెలిపిన ప్రదీప్…తాగి ఎవరు వాహనం నడపొద్దని సూచించారు. తనకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

సోమవారం మధ్యాహ్నం బేగంపేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రదీప్‌ కౌన్సెలింగ్‌కు హాజరవుతారని భావించారు. ఈ మేరకు ట్రాఫిక్‌ డీసీపీ చౌహాన్‌కు ప్రదీప్‌ సమాచారం కూడా అందించారు. కానీ ప్రదీప్‌ అనూహ్యంగా గోషామహల్‌ ట్రాఫిక్ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు.

pradeepgoshamahal

డిసెంబర్‌ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రదీప్‌  పట్టుబడ్డారు. కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో పోలీసులు కేపీహెచ్‌బీలోని ఆయన కార్యాలయంతోపాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అందించేందుకు ప్రయత్నించారు. అయితే, అతను అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చారు. దీంతో ప్రదీప్‌ పరారీలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు.  గత శుక్రవారం వీడియో ద్వారా తాను త్వరలోనే కౌన్సెలింగ్‌కు హాజరుకాబోతున్నట్లు తెలిపిన ప్రదీప్ ఇవాళ తండ్రితో కలిసి కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు.

- Advertisement -