అస్వస్థతకు గురైన అమితాబ్..

322
amithab

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. లివర్ సంబంధిత సమస్యతో సీనియర్ బచ్చన్ ఆస్పత్రిలో చేరినట్టు పలు వార్తలు వస్తున్నాయి. ఈనెల 15న రాత్రి 2 గంటల సమయంలో కుటుంబసభ్యులు అమితాబ్ బచ్చన్‌ను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా ఇటీవలే అమితాబ్ తన ఆరోగ్యానికి ఆసక్తికర విషయం బయటపెట్టాడు. స్వస్థ్ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ… టీబీ సోకిన 8 ఏళ్ల వరకు తనకు ఆ విషయమే తెలియదని, చాలా ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో బయటపడిందని తెలిపాడు.

big b

‘గతంలో నాకు క్షయ(టిబి), హెపటైటిస్ బి వ్యాధులు ఉండేది. క్షయ సోకిందనే విషయం 8 ఏళ్ల వరకు తెలియలేదు. రెగ్యులర్‍‌ గా మెడికల్ చెకప్ చేయించుకోకపోవడమే ఇందుకు కారణం. దీంతో నా 25 శాతం లివర్(కాలేయం) చెడిపోయింది. ప్రస్తుతం నేను 25 శాతం కాలేయంతోనే సర్వైవ్ అవుతున్నాను’ అని బిగ్ బి తెలిపాడు.

ఇటీవలే ఆయన ‘బద్లా’ సినిమాలో కనిపించారు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కూడా గోసాయి వెంకన్న పాత్రలో అలరించారు. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో కలసి ‘గులాబో సితాబో’ సినిమాలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 24న అమితాబ్ బచ్చన్‌ను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.