ఒకరోజు పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన బీజేపీ చీఫ్ అమిత్ షా ఆ పార్టీ కార్యకర్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతల పనితీరు బాగాలేదని మందలించారు. తొలుత బేగంపేట చేరుకున్న షా…అక్కడ కార్యకర్తల సమావేశంలో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పనితీరు ఇలాగే ఉంటే బీజేపీకి మెజారిటీ స్ధానాలు దక్కడం కష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు.వివిధ అంశాలతో కూడిన 23 కార్యక్రమాలు అప్పగిస్తే కేవలం 12 మాత్రమే పూర్తి చేయడాన్ని ప్రశ్నించారు.
పోలింగ్ బూత్‌లు, శక్తి కేంద్రాల కమిటీల ఏర్పాటు ఇప్పటి వరకు పూర్తికాలేదని, ఇక్కడి కంటే ఏపీనే బెటరని అన్నారు. గతంలో తెలంగాణలో బలంగా ఉన్నామని కానీ ఇప్పుడు బలహీన పడుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఒంటరిగానే ముందుకు వెళ్దామని దానికి తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తేల్చిచెప్పారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
అయితే,మరోవైపు షా టూర్‌పై కార్యకర్తలు కాసింత అసంతృప్తికి లోనయ్యారు. ఆయన పర్యటన షెడ్యూల్, ప్రణాళిక అయోమయంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేగాదు అమిత్ షా వ్యవహార శైలి అర్థం కాక నాయకులు,కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు.