‘పీఎం నరేంద్ర మోదీ’ బ‌యోపిక్‌లో అమిత్ షా..!

118
Amit Shah

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల హవా న‌డుస్తున్న నేపథ్యంలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జీవితం ఆధారంగా ఒమంగ్ కుమార్ ‘పీఎం నరేంద్ర మోదీ’ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మోదీ పాత్రను ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్నాడు. వివేక్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల విడుద‌లైంది. ఇక మోదీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి అమిత్ షా. ఈ బయోపిక్‌లో ఆయన సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

Amit Shah

న‌టుడు మనోజ్ ‌జోషి అమిత్‌ షా పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నారు. అమిత్ షా పాత్ర‌లో న‌టించ‌మని నిర్మాత కోర‌డంతో మ‌రో మారు ఆలోచించ‌కుండా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాన‌ని మ‌నోజ్ జోషి తెలిపారు. నేను పోషించిన ఆస‌క్తిక‌ర పాత్ర‌ల‌లో ఇది ఒక‌టి అని మ‌నోజ్ అన్నారు. ఇటీవల అహ్మ‌దాబాద్‌లో ప్రారంభ‌మైన ఈ చిత్ర షూటింగ్, గుజ‌రాత్‌లోని ప‌లు ప్రాంతాల‌లోను చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది.

‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్‌లో బొమన్‌ ఇరానీ, దర్శన్‌ కుమార్ ,జ‌రీనా వ‌హ‌బ్, మ‌నోజ్ జోషి, ప్ర‌శాంత్ నారాయ‌ణ‌న్‌, బ‌ర్క బిష్ట్ సేన్‌గుప్తా, అక్ష‌త్ ఆర్ స‌లుజా, అంజ‌న్ శ్రీవాత్స‌వ్, రాజేంద్ర గుప్తా, య‌తిన్ క‌రేయ్ క‌ర్ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. న‌రేంద్ర‌మోదీ త‌న రాజ‌కీయ ప్ర‌యాణంలో ముఖ్య‌మంత్రిగా త‌న హ‌వా కొన‌సాగిస్తూ ప్ర‌ధాన మంత్రి ఎలా అయ్యాడో ఈ బ‌యోపిక్‌లో చూపించ‌నున్న‌ట్టు నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళంతో పాటు 23 భాషల్లో విడుదల చేయనున్నారు. వివేక్ ఒబెరాయ్ తండ్రి సురేష్ ఒబెరాయ్, సందీప్ సింగ్‌లు ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.