అమిత్ మిశ్రా.. ఇద్దరు స్పిన్నర్లు అవసరమైనప్పుడు మాత్రమే జట్టులోఉంటాడు. స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ జట్టులో లేకపోయినా మిశ్రా టీమ్‌లో ఉంటాడు. అందుకే 2000లోనే అరంగేట్రం చేసినా అతనాడింది 36 వన్డేలే. ఐతే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో అశ్విన్‌కు విశ్రాంతి ఇవ్వడంతో దొరక్క దొరికిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడీ దిల్లీ లెగ్‌స్పిన్నర్.
కెరీర్‌లో తొలిసారి వరుసగా ఐదు వన్డేలాడిన మిశ్రా.. స్థిరంగా రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు. వైజాగ్ వన్డేలో ఘన విజయం తరువాత స్పందించాడు అమిత్ మిశ్రా . భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే తనకెంతో అండగా నిలిచాడని, ఆయన ప్రోత్సాహంతోనే తానేంటో నిరూపించుకున్నానని చెప్పుకొచ్చాడు.
తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం వెనుక కుంబ్లే సహకారం ఎంతో ఉందని, అంచనాలకు అనుగుణంగా రాణించడంపై తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో సాధించిన రికార్డులను పట్టించుకోకుండా భవిష్యత్ మ్యాచ్ లపై దృష్టిని సారించి ముందడుగు వేయాలన్నది తన లక్ష్యమని పేర్కొన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేశానని, దాంతోనే తనకు ఐదు వికెట్లు దక్కాయని తెలిపాడు.
నిజానికి పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరవడం మిశ్రాకు ఇదేం కొత్త కాదు. ఐపీఎల్‌లో అతను ఎన్నోసార్లు సత్తా చాటాడు. 2008లో డక్కన్ చార్జర్స్‌పై, 2011లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై, 2013లో పుణె వారియర్స్‌పై అతను హ్యాట్రిక్స్ నమోదు చేశాడు ఆల్‌టైమ్ టాప్-5 వికెట్ల జాబితాలో మిశ్రా ఉన్నాడు. విశాఖ ఆఖరి వన్డేలో ఫ్లయిటెడ్ బంతులు, గూగ్లీలు, ఫ్లిప్పర్లతో కివీస్ బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు మిశ్రా. నీషమ్, వాల్టింగ్‌లను ఒకే ఓవర్లో ఔట్ చేయడానికి అతను సంధించిన బంతులు అమోఘం. బంతి ఎక్కడ పడి ఎలా తిరిగి వికెట్లను కూలదోసిందో తెలియక కివీ బ్యాట్స్‌మెన్ బిత్తరపోయారు. మ్యాచ్‌లో అత్యుత్తమ బంతితో వాట్లింగ్‌ను పెవిలియన్ చేర్చాడు.