ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్…భారత మార్కెట్‌లో మరింత బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. భారత్‌లో డిజిటల్ ఎకానమీ రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రముఖ టెలికాం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది.
ఎయిర్ టెల్ లో 5శాతం వాటాను అమెజాన్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. అమెజాన్ కు ఎయిర్ టెల్ కు మధ్య చర్చలు జరుగుతున్నాయని, ప్రణాళిక బద్ధమైన పెట్టుబడుల పూర్తయితే అమెజాన్, ఎయిర్ టెల్ లో 5శాతం వాటాను కొనుగోలు చేయడం ఖాయమేనని జాతీయ మీడియా వార్తలను ప్రచురించింది.
ఎయిర్‌టెల్‌లో 5 శాతం వాటా అంటే డీల్ విలువ రూ.15,000 కోట్లు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు అటు అమెజాన్ కానీ, ఇటు ఎయిర్‌టెల్ గానీ నిరాకరిస్తున్నాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్ బోర్డు ఈ నెల 11న సమావేశం కానుంది. సమావేశం తర్వాత ఈ డీల్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఎయిర్‌టెల్‌కు 30 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.