రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని జమ్మూకశ్మీర్‌లోని పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది విజయవంతంగా ముగిసింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో హిమాలయ ప్రాంతం శివనామస్మరణతో మార్మోగింది.
ఈ ఏడాది యాత్రలో భాగంగా సాంప్రదాయ మార్గాలైన పహల్గామ్ మరియు బాల్తాల్ మార్గాల ద్వారా మొత్తం 4.8 లక్షలకు పైగా భక్తులు అమర్‌నాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు.
శ్రీ అమర్‌నాథ్ జీ పవిత్ర గుహాలయంలోకి ‘ఛడీ ముబారక్’ (పవిత్ర దండం) చేరుకోవడంతో వైదిక మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఈ ఏడాది యాత్ర అధికారికంగా పూర్తయింది. మహాత్ దీపేంద్ర గిరి నేతృత్వంలో పవిత్ర గుహ వద్ద జరిగిన ఈ అంతిమ పూజా కార్యక్రమంలో సాధువులు, అధికారులు పాల్గొన్నారు.
Also Read:రాఖీ..స్పెషల్ వంటకాలు!
కఠినమైన భద్రతా ఏర్పాట్లు, నిఘా నీడన సాగిన ఈ వార్షిక యాత్ర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిసింది. యాత్రికులకు భద్రతతో పాటు రవాణా, వైద్యం, వసతి వంటి సదుపాయాలను కల్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు భద్రతా బలగాల యంత్రాంగానికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

