వివాదాస్పద వ్యాఖ్యలతో హెడ్ లైన్స్‌లో ఉండే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఈ సారి బస్తీ మే సవాల్ అంటూ మరోసారి వార్తల్లోకి వచ్చారు. పాకిస్థాన్ నటులు నటించిన సినిమాలను ఆడనివ్వబోమన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్)పై విరుచుకుపడ్డారు. ఉరి దాడి తరువాత పాకిస్తాన్‌కు చెందిన నటుల్ని బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఇక పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘యే దిల్ హై ముష్కిల్’ చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ్‌నిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే.
దీనిపై స్పందించిన కట్జూ.. అరేబియా సముద్రపు నీరు తాగిన గూండాలు ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను త్రివేణీ సంగమం నీరు తాగిన అలహాబాదీ గుండాని ఎంఎన్‌ఎస్‌ను హెచ్చరించారు. ఏం చేయాలనే నిస్సహాయులైన నటుల మీద చూపే ప్రతాపం తనపై చూపాలన్నారు. తనతో కుస్తీకి రావాలని.. అప్పుడు ఎవరు పెద్ద గుండానో ప్రపంచానికి చూపిద్దామని కట్జూ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన కట్జూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
ఇక పలానా సినిమా చూడొద్దంటూ చెప్పే హక్కు మీకెవరిచ్చారంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)ను కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఎమ్మెన్నెస్ రౌడీల పార్టీ అని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆయన మండిపడ్డారు. దీంతో బుధవారం బాబుల్ సుప్రియోపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.
‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదల గండాన్ని ఎదుర్కొంటున్న వేళ ముఖేష్ భట్ నేతృత్వంలోని నిర్మాతల సంఘంతో కలసి చిత్ర నిర్మాత కరణ్ జొహార్ రాజ్ నాథ్ ను కలిసి చర్చలు జరుపగా, ఏ విధమైన హింసాత్మక ఘటనలు జరుగకుండా 100 శాతం పోలీసు భద్రతను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన ముఖేష్ భట్, “థియేటర్ల వద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అందరు ముఖ్యమంత్రులతో తాను మాట్లాడుతానని రాజ్ నాథ్ చెప్పారు” అన్నారు. కాగా, తనకు దేశమే ముఖ్యమని, దేశం ముందు మరే విషయమూ ఎక్కువ కాదని, ఇకపై తన చిత్రాల్లో పాకిస్థాన్ నటీ నటులను వినియోగించనని కరణ్ జొహార్ వెల్లడించిన సంగతి తెలిసిందే.