శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై వి. వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన సినిమా “అల్లుడు శీను”. సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం 2014 జూలై 25న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమా ద్వారా నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్నకొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం కాగా సమంత హీరోయిన్‌గా నటించింది. ఇక ప్రకాశ్ రాజ్, ప్రదీప్ రావత్, కన్నెగంటి బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషించగా తమన్నా మొదటి సారి ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్‌చేసి ప్రేక్షకులను అలరించింది.
నల్గొండలోని సిరిపురం అనే ఓ పల్లెటూళ్లో కథ మొదలై అల్లుడు శీను, అతని మామ నరసింహ అప్పుల పాలై ఊరి నుండి దుబాయ్ వెళ్లాలనుకుని చెన్నై ట్రైన్ బదులు హైదరాబాదు ట్రైన్ ఎక్కేస్తారు. దాంతో వారు హైదరాబాదు చేరుకుంటారు. నరసింహ పోలికలున్న భాయ్ హైదరాబాదులో దందాలు, సెటిల్ మెంట్స్ చేస్తుంటాడు. దాంతో శీను ఆ డాన్‌ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడం, ఆ విషయం డాన్‌కి తెలియడంతో తర్వాత ఏం జరుగుతుంది..?ఆ డాన్‌కి, నరసింహకి ఉన్న సంబంధం ఏంటి..?చివరికి కథ ఎలా సుఖాంతంగా ముగిసిందనేదే అల్లుడు శ్రీను కథ.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు మరింత ప్లస్ కాగా ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన ఈ మూవీతో అలరించిన బెల్లంకొండ శ్రీను…తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఛత్రపతి రీమేక్‌లో నటిస్తున్నారు.