ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. నా పేరు సూర్య తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఏంటనేదానిపై స్పష్టత వచ్చింది. న్యూఇయర్ కానుకగా సినిమా గురించి విషయాలను భయటపెడతానని ప్రకటించినట్లుగానే అల్లు అర్జున్ సినిమాపై ప్రకటన వచ్చేసింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి బిగ్గెస్ట్ హిట్ సాధించాయి. మరోసారి వీరి కాంబోలో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. 2019 జనవరిలో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కాబోతోంది.
బన్నీ 19వ సినిమాగా ఇది రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని నిర్మాతలు తెలిపారు. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ‘AA19’ అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విటర్ ఇండియా ట్రెండింగ్‌లో మూడో స్థానంలో ఉంది.