ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అటవీనేపథ్యంలో ఎర్రచందనం అక్రమరవాణా ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న కథానాయిక. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ పోషిస్తుండగా, మరో కీలకపాత్రలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం మేకింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఈ వీడియో మొదట్లో అల్లు అర్జున్ పుష్ప చిత్రబృందానికి ఓ మెసెజ్ ఇచ్చాడు. “షూటింగ్ లొకేషన్‌కు ఎలా వచ్చామో అలాగే వెళ్లిపోదాం. ఎవరు వాడిన ప్లాస్టిక్ బాటిళ్లు, కప్పులు అన్నీ ఎవరికి వారే తీసుకువచ్చి డస్ట్ బిన్లో వేసేయండి. మనం రాకముందే ఈ ప్లేస్ ఎలా ఉందో మనం వెళ్లిన తర్వాత కూడా అలాగే ఉండాలి” అంటూ బన్నీ పర్యావరణ హితం కోరి పిలుపునిచ్చారు. అంతేకాదు, ఈ వీడియోలో పుష్ప మేకింగ్ సీన్లు కూడా ఉన్నాయి. రేపు ట్రైలర్ విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా వచ్చిన మేకింగ్ వీడియో బన్నీ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.