హీరో అల్లు అర్జున్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కాకినాడ జిల్లాలో జరిగిన విషాద ఘటనలో తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలికి ఆయన ఆర్థిక అండగా నిలవాలని నిర్ణయించారు.
కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలో గత నెల 28వ తేదీన బాణసంచా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, వారిలో కడింపల్లి దుర్గ తండ్రి కూడా ఉన్నారు. తండ్రి మరణంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న మానసిక దివ్యాంగురాలు దుర్గ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కుటుంబానికి ఆదుకోవడానికి ఎవరూ లేకపోవడంతో ఆమె పరిస్థితి స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్లు అర్జున్ స్పందించారు. దుర్గ పరిస్థితి చూసి ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించిన ఆయన, జీవితాంతం ప్రతినెల రూ.7,500 ఆమె బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆమె భవిష్యత్తుకు కొంత భరోసా లభించింది.
అల్లు అర్జున్ సూచనల మేరకు నిర్మాత బన్నీ వాసు ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు దుర్గ ఇంటికి వెళ్లి ఆమె పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే ఆర్థిక సహాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. హీరో అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అభిమానులు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారికి చేయూతనివ్వడంలో ఆయన ముందుండటం మరోసారి స్పష్టమైంది.
Also Read:మైత్రీ మూవీ మేకర్స్.. ‘జెట్లీ’ షూటింగ్ పూర్తి

