మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని ముందుకుసాగుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తుండగా తర్వాత కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ఇక బన్నీ సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా మరో గుడ్ న్యూస్ అందించారు అల్లు అర్జున్.
ముద్దు ముద్దు మాటలు, అల్లరి చేష్టలతో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన అల్లు అర్జున్ కూతురు అర్హ త్వరలో వెండితెరపై మెరవనుంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ‘శాకుంతలమ్’ సినిమాలో నటించనుంది అర్హ. ఈ విషయాన్ని ధృవీకరించారు బన్నీ. అల్లు ఫ్యామిలీ నుంచి నాలుగో తరం కూడా ఇండస్ట్రీకి రావడం గర్వకారణం. నా కూతురికి ఇంత మంచి డెబ్యూ ఇస్తున్న గుణశేఖర్, నీలిమలకు థ్యాంక్స్ అంటూ పేర్కొన్నారు.
శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్న ఈ చిత్రంలో యువరాజు భరత్‌గా అర్హ కనిపించబోతోంది. మరి తొలి సినిమాతో అర్హ ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.