రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌ను యూనిట్ వినూత్నంగా నిర్వహిస్తోంది. సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ‘కోట బొమ్మాళి పీఎస్ ప్రచార సభ’ పేరుతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో స్టేజ్‌పైకి వచ్చిన వారంతా ఓటు వేసే థీమ్‌తో పాటు, ఎప్పుడూ మీడియా వారే సినిమా వాళ్లని ప్రశ్నలు అడిగే ట్రెండ్‌కు బ్రేక్ వేస్తూ.. మీడియా వారిని స్టేజ్‌పై కూర్చోబెట్టి సినిమా వారు ప్రశ్నలు అడిగారు. ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. అనంతరం చిత్ర బృందం సినిమా విశేషాలను తెలిపితే.., హాజరైన అతిథులు యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. ఎవరూ చెప్పని ఒక చిన్న కథ చెబుదామనే.. అంటే పోలీసులు క్రిమినల్స్‌ని, క్రిమినల్స్ వాళ్లకి లొంగేవారిని లొంగదీసుకోవడం వంటిది జరుగుతుంటుంది. ఈ కథలో ప్రత్యేకం ఏమిటంటే.. సింపుల్.. ‘పోలీస్ చేజేస్ పోలీస్’. పోలీసులని పోలీసులు పట్టుకోవాలనే ఒక విచిత్రమైన కథ. ఈ సినిమాలో ఎవరూ హీరోలు లేరు. కథే హీరోగా వెళుతుంటుంది. తప్పకుండా ఈ వెరైటీని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. చాలా బిజీగా ఉండి కూడా ఈ వేడుకకు వచ్చిన బోయపాటిగారికి ధన్యవాదాలు. శ్రీకాంత్ నాకు ఆత్మీయుడు. మా బ్యానర్లో ‘పెళ్లిసందడి’తో మొదలయ్యాడు. అప్పటి నుంచి ఎక్కడ అవకాశం ఉన్నా మా సినిమాల్లో నటిస్తుంటాడు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. హీరో రాహుల్ వాళ్ల నాన్న మా బ్యానర్లో ఫైట్ మాస్టర్‌గా చేశాడు. వాళ్లబ్బాయి హీరోగా చేస్తున్నాడు. పోలీసుల్ని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు? అనేది చెప్పడం కోసం కోటబొమ్మాళి అనేది తీసుకున్నాం. ఇది ఏ రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆఫీసర్ని ఉద్దేశించి మేము తీయలేదు. ఆల్ ఇండియాలో ఉన్న ఓ వ్యవస్థని ఖండిస్తూ తీసిన సినిమా ఇది. పోలీసులను న్యాయం చేయనీయరు అనేది చెప్పడం జరిగింది తప్పితే.. ఎవరినీ ఉద్దేశించింది మాత్రం కాదు. ఈ మెసేజ్‌ని ఈ ఎలక్షన్ల టైమ్‌లో తీసుకెళ్లే సందర్భం మాకు కుదిరింది. కథ ఎన్నుకునే సమయంలోనూ, అలాగే ఎడిటింగ్ రూమ్‌లో మాత్రమే నేను.. మిగతా అంతా బన్నీవాసు, విద్య, భాను, రియాజ్‌లే చూసుకున్నారు. హీరోలని, హీరోయిన్లని ఇంట్రడ్యూస్ చేయడం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. వారితో పాటు నిర్మాతలని కూడా తయారు చేసి పంపుతున్నాను. ‘బేబి’ నిర్మాతలు మా సంస్థ నుంచి వచ్చిన వారే. ఇంకా ఎంతో మంది నూతన నిర్మాతలు మా సంస్థ నుంచి రావాలని కోరుకుంటున్నాను. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ.. ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘‘మీడియా మిత్రులకు, ఈ వేడుకకు హాజరైన పెద్దలకు, వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోట బొమ్మాళి సినిమా గురించి చెప్పాలంటే.. ‘లింగిడి లింగిడి’ సాంగ్ ప్రతి ఒక్కరికీ చేరింది అనేది నిజం. ఈ సాంగ్ ప్రతి ఒక్కరి మైండ్లోకి, హార్ట్‌లోకి వెళ్లి కూర్చుంది. కాబట్టి ఈ పాట సినిమాకు అద్భుతమైన ప్లస్. ఒక డైలాగ్, విజువల్స్, పంచ్, టీజర్, ట్రైలర్ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇక్కడ ట్రైలర్‌తో పని లేకుండా ఈ సాంగ్ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది. అందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్ చెబుతున్నాను. ఇది ఒక మంచి మూమెంట్. సినిమా మంచి హిట్ అవుతోంది. నేను ట్రైలర్ చూశాను.. ఇప్పుడున్న పరిస్థితులకి చెప్పాలి అనుకున్న విషయాన్ని క్లియర్ గా చెప్పాడు. అలాంటి వాటిని ఏ ప్రేక్షకుడైనా ఆదరిస్తాడు. ఈ సినిమా ఇప్పటికే సక్సెస్ కొట్టినట్లే. తెలుగమ్మాయి, జీవిత రాజశేఖర్ గార్ల కూతురు శివాని చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కానీ.. మంచి నటి. ఆమెకు గర్వంగా చెప్పుకునే పాత్ర ఇంకా పడలేదు. అది ఈ సినిమాతో నెరవేరుతుందని అనుకుంటున్నాను. హీరో రాహుల్ స్టేజ్ మీద మాట్లాడుతుంటే వాళ్ల నాన్నగారు విజయ్ మాస్టర్‌గారు వచ్చారు. మా గురువుగారు ముత్యాల సుబ్బయ్య గారు సినిమాలో విజయ్ గారు ఫైట్ చేస్తూ ఉంటే.. ఆయన్ని చూస్తూ మేము ఎదిగాము. ఈ రోజు ఇక్కడ ఉన్నాం. ఆయన ఇక్కడికి వచ్చి ఈ ఎమోషన్ని తట్టుకోలేక లైట్లు పడుతున్నాయ్.. కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయ్ ఏమి అనుకోవద్దు అన్నాడు. ఎమోషన్లో వచ్చినవి అవి. నీ తండ్రి ఎమోషన్ని రాహుల్.. నువ్వు నిలబెట్టాలి. ఆ రోజే నువ్వు సక్సెస్ అయ్యినట్లు. ‘కోటబొమ్మాళి’ ప్రచార సభ అని మొదలెట్టిన ఈ ఎలక్షన్లో.. రేపు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆశిస్తూ.. చిత్రయూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని తెలిపారు.
Also Read:CM KCR:డోర్నకల్‌లో గెలిచేది రెడ్యానాయకే