అల్లరోడు అల్లరి నరేష్‌కి, అక్కినేని వారసుడు నాగ చైతన్యకు మధ్య పోటీ తప్పేలా లేదు. ఆ ఇద్దరికి మధ్య పోటీ ఏంటా అని ఆశ్చర్యపోకండి! ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ పర్సనల్ కాదు.. సెప్టెంబర్ 8న ఆ ఇద్దరూ కలిసి చేయనున్న బాక్సాఫీస్ వార్ గురించి. అవును, అల్లరి నరేష్ హీరోగా నటించిన మేడ మీద అబ్బాయి సినిమా, చైతూ నటించిన యుద్ధం శరణం మూవీ సెప్టెంబర్ 8న ఒకేసారి విడుదల కానున్నాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదనిపిస్తోంది.
అల్లరి నరేష్ సినిమా అంటే ఒకప్పుడు హాట్ కేక్. పెద్ద హీరోల రెమ్యూనిరేషన్ అయిదు నుంచి ఆరు కోట్ల రేంజ్ లో వున్నపుడు అల్లరి నరేష్ రెమ్యూనిరేషన్ కోటిన్నర, రెండు కోట్లు వుండేది. అప్పట్లో నాలుగయిదు కోట్లతో అల్లరి నరేష్ సినిమా తీస్తే నిర్మాతకు లాభాల పంటే. అలాంటిది రోజులు మారాయి. సుడిగాడు సినిమా తరువాత అల్లరి నరేష్ కు సరైన విజయాలు లభించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎందరు రైటర్లను మారుస్తున్నా, ఏ కథలు చేస్తున్నా లక్కు చిక్కి హిట్ కొట్టలేకపోతున్నాడు. ఆఖరికి మళయాలంలో మంచి హిట్ అయిన సినిమా రీమేక్ హక్కులు కొని, మేడమీద అబ్బాయి అనే డిఫరెంట్ సినిమా చేసాడు. ఆ భాషలో మంచి హిట్ సినిమా.
ఈ హక్కుల కోసం అప్పట్లో చాలా మంది పోటీ పడ్డారు కూడా. అలాంటి సినిమా సంపాదించి పూర్తి చేసాడు. ఆ సినిమాను అమ్మడం గగనం అవుతోందని వార్తలు వినవస్తున్నాయి. విడుదల వారం రోజుల లోపునకు వచ్చేసింది. కానీ ఇంకా అమ్మకాలు షురూ కాలేదంటున్నారు. ఎలా లేదన్నా సినిమాకు అయిదారు కోట్లకు పైగానే ఖర్చయివుంటుంది. సినిమా బాగుంటే శాటిలైట్ మూడు దాకా వచ్చేస్తుంది. కానీ మిగిలింది? డైరక్ట్ విడుదల చేసుకుంటే గాల్లో దీపం పెట్టినట్లే. మేడ మీద అబ్బాయి, యుద్ధం శరణం గచ్చామి సినిమాల్లో ఆడియెన్స్‌ని ఏ సినిమా ఎక్కువగా ఆదరిస్తుందో మరి!