తెలంగాణ ప్రభుత్వ హయాంలో గత ఆరేళ్లలో రాష్ట్రం సస్యశ్యామలంగా రూపాంతరం చెంది, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్, టీ యూ డబ్లు జే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద యూనియన్ నాయకులతో కలిసి అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అమరుల త్యాగం వృధా కాలేదని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఫలితంగా నాలుగేళ్లలో తెలంగాణలో జల సిరి కురిసి రైతుల ముఖాల్లో ఆనందాన్ని నింపిదన్నారు.
సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండగ అన్న పరిస్థితి నుంచి నేడు అదే వ్యవసాయం పండగ అనే స్థితికి రావడం గొప్ప మార్పు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ జర్నలిస్టు ఫోరంగా క్రియాశీలకంగా వ్యవహరించి 13 ఏళ్ల పాటు ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వాములైన జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన మిగులు నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. గతంలో విడుదల చేసిన నిధుల నుండి ఆరేళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని మిగులు నిధులు కూడా విడుదల చేస్తే మరిన్ని కార్యక్రమాలు చేపట్టవచ్చు అన్నారు.
కరోన విపత్తు నేపథ్యంలో వైద్యులు, పోలీసులు,పారిశుద్ధ కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా తమ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని ఇలాంటి సందర్భంలో జర్నలిస్టు లకు కనీసం 20 లక్షలకు తగ్గకుండా భీమా వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత మూడు నెలలుగా జర్నలిస్టుల ఆర్థికంగా బాగా చితికిపోయారని వారిని ఆదుకోవడానికి న్యాయవాదులకు ఇచ్చిన విధంగానే 25 కోట్ల సహాయం వెంటనే ప్రకటిస్తే కనీసం ఒకొక్కరికి తక్షణ సహాయంగా పది వేల రూపాయలు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే చొరవ చూపాలని కోరారు.
రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఈ సందర్బంగా జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ హజారి, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, TEMJU రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్,చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసఫ్ బాబు, హైదరాబాద్ అధ్యక్షులు యోగానంద్,ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ యార తదితరులు పాల్గొన్నారు.