బోనమెత్తిన లష్కర్.. 22న రంగం

483
secundrabad bonalu
- Advertisement -

బోనాల సందడితో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. బస్తీ, వాడా బోనాలకు సర్వాంగ సుందరంగముస్తాబు కాగా అమ్మవార్ల ఆలయాలు కొత్త శోభ సంతరించుకున్నాయి. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, డీజేల హోరు, పాటలు వెరసి ఆషాఢమాస బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

నెల రోజుల పాటు జరిగే బోనాల జాతర వేడుకలో ప్రధానమైన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే అమ్మవారి దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 21న బోనాలు, 22న రంగం వేడుకలు జరుగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ఆదివారం తొలి బోనం సమర్పించారు. ప్రతి యేటా అమ్మవారికి దేవాలయం తరపు నుండి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ. జోగిని శ్యామల తనదైన శైలీలో అమ్మవారి బోనాన్ని తలపై పెట్టుకొని నృత్యం చేస్తూ ఆలయానికి చేరుకుని బోనం సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో పూర్తిచేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానికంగా ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులు అన్ని వర్గాల ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి బోనాల పండుగను ఇన్సిడెంట్ ఫ్రీగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రధాన జాతరకు వేల సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ సారి జాతరకు ఐదు రోజుల ముందు 16న చంద్రగ్రహణం వస్తుంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మహంకాళి దేవాలయాన్ని మూసివేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటలకు దేవాలయంలో పూజలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

- Advertisement -