కేజ్రీవాల్ అరెస్ట్.. రంగం సిద్ధం?

14
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ? ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుందా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా డిల్లీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాం బయట పడిన తర్వాత ఆమ్ ఆద్మీ నేతల చుట్టూ అవినీతి ఆరోపణలు పెరుగుతూ వచ్చాయి. ఈ కేసులో భాగంగా ఇప్పటికే డిల్లీ మాజీ డిప్యూటీ సి‌ఎం మనిష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆప్ కన్వీనర్ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా డిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగముందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ కు ఇప్పటికే ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. గత ఏడాది ఏప్రెల్ ఆయనను ఈడీ విచారించింది కూడా.

అయినప్పటికి ఈ స్కామ్ లో క్లారిటీ రాకపోవడంతో మళ్ళీ విచారణకు హాజరు కావాలని గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 ఇలా ఐదు సార్లు సమన్లు జారీ చేసింది ఈడీ. అయినప్పటికి ఇందులో ఏ ఒక్కసారి కూడా కేజ్రీవాల్ ఈడీ ఎదుట హాజరు కాలేదు. దాంతో డిల్లీ సి‌ఎం విచారణకు సహకరించడం లేదని ఈడీ సీబీఐ కోర్టును ఆశ్రయించింది. ఈ నెల 17న ఆయన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది ధర్మాసనం. దీంతో ఇప్పుడు కేజ్రీవాల్ కోర్టు ఎదుట హాజరవుతారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు ఈడీ నోటీసులకు స్పందించని కేజ్రీవాల్.. కోర్టు ఎదుట కూడా హాజరు కాకపోతే ఆయనను అరెస్ట్ చేయడం గ్యారెంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆప్ నేత జాస్మిన్ షా ఇటీవల చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఇన్నాళ్ళు ఈడీ సమన్లను దాటవేసిన కేజ్రీవాల్ కోర్టు ఆదేశాల విషయంలో ఏం చేస్తారనేది చూడాలి.

Also Read:ప్రతిపక్షనేతపై కాంగ్రెస్ కక్ష సాధింపు

- Advertisement -