అవినీతి అన్నివిధాలా రూపుమాపు కావాలి..

222
All kinds of corruption must end
- Advertisement -

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశానికి భవిష్యత్‌లో మంచి జరుగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం నోట్ల రద్దుతో వచ్చే ఇబ్బందులు, తీసుకోవాల్సిన పరిస్థితులన్ని ప్రధాని మోడీ దగ్గర వివరంగా ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. మంచి జరుగుతుందనే ప్రధాని నిర్ణయాన్ని సమర్ధించానని…ప్రజలకు ఇబ్బందులు తలెత్తే పరిస్ధితి వస్తే కేంద్రంపై పోరాడటానికి సిద్ధమేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అవినీతి అన్ని విధాలా రూపు మాపు కావాలని తెలిపారు.

సైబర్ క్రైం ఎప్పుడు జరిగేదే అని…దానిని ఈ అంశంతో ముడిపెట్టడం సరికాదని సూచించారు. మంచి జరుగుతున్నప్పుడు అందరు కచ్చితంగా అందరు సమర్ధించాలని…మార్పును అంగీకరించాలని తెలిపారు. నోట్ల రద్దు వల్ల కష్టాలు ఉంటాయని… దేశం అభివృద్ది చెందుతుందంటే కష్టాలు ఉంటే తప్పేంటి అన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని బీహార్ ముఖ్యమంత్రి సమర్ధించారని సీఎం గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నోట్ల రద్దుపై 50 రోజుల సమయం అడిగారని…ప్రజలు సహకరించాలని సూచించారు.

రాష్ట్రాల ఆదాయం పెరగాలంటే ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. నోట్ల రద్దుతో ఇబ్బందులు ఉన్నా…. ఈ అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు. నోట్ల రద్దు వల్ల కష్టాలుంటాయని ప్రధాని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు సీఎం. పెద్ద నోట్ల రద్దు ప్రభావం తెలంగాణపై కొంతమేరకు ఉందన్నారు. నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ మొదటి స్ధానంలో ఉందని గుర్తుచేశారు.

నగదు రహిత లావాదేవీల భద్రతపై అనుమానాలు వద్దన్నారు. సైబర్ క్రైమ్‌పై ప్రధానికి అవగాహన ఉందన్నారు.నోట్ల రద్దుతో ఇబ్బందులు తలెత్తిన…అంతిమంగా దేశం అభివృద్ధి చెందుతుందని మోడీ తెలిపారని సభకు వెల్లడించారు. ప్రధాని మోడీ సైతం వందశాతం నగదు రహిత లావాదేవీలు సాధ్యం కాదని చెప్పారన్నారు.

అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఏ పథకం ప్రవేశ పెట్టిన అంతులేని అవినీతి జరుగుతుందని…దానిని అరికట్టేందుకే ఈ నిర్ణయమని తెలిపారు. ప్రధాని నిర్ణయంతో అవినీతి, నల్లధనం అరికట్టవచ్చని తెలిపారు. ఎవరి దగ్గర బంగారం, వజ్రాల రూపంలో నల్లధనం ఉంటుందో వాటిని కేంద్రం లాక్కుంటుందని వెల్లడించారు. నోట్ల రద్దుతో తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా…అంతిమంగా వచ్చే ఫలితం దేశానికి మంచే జరుగుతుందన్నారు. ప్రజల్లో భయోత్పత వాతావరణం కల్పించవద్దని సీఎం సూచించారు. సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్‌లో వందశాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. నగదు రహిత లావాదేవీలకు 50 యాప్‌లకు పైగా అందుబాటులోని ఉన్నాయని..కేంద్రం చిన్న నోట్లను రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పంపించాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -