టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ ఆలీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల్లో రాజకీయ నాయకులు తాము టోపీలు పెట్టుకోవడమే కాకుండా ముస్లింలకు కూడా టోపీలు పెడుతున్నారంటూ విమర్శించాడు. నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో ‘జాగో ముస్లిం… చలో గుంటూరు’ పేరుతో తలపెట్టిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి ఆలీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించాడు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ మతాన్ని ఓట్ల కోసం వాడుకుంటున్నారంటూ ఆక్రోశించాడు. ముస్లింల పర్వదినమైన రంజాన్ రోజునే రాజకీయ నాయకులకు ముస్లింలు గుర్తొస్తారని ఆలీ విమర్శించారు. ఆరోజు వారు తలపై టోపీలు పెట్టుకోవడమే కాకుండా ముస్లింల నెత్తిపైనా టోపీలు పెడుతున్నారని అన్నారు. చదువుతోనే ప్రగతి సాధ్యమని, బలవంతపు మతమార్పిడులు మంచివి కావని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకే ముస్లింలు ఓటేయాలని ఆలీ పిలుపునిచ్చారు.
2014 ఎన్నికల సమయంలో రాజమండ్రి శాసన సభకు టీడీపీ నుంచి ఆలీ పోటీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు ఆమధ్య కాలంలో పవన్ జనసేన పార్టీ అవసరమైతే తన వంతు సేవలు అందిస్తానని పరోక్షంగా వ్యాఖ్యలు చేసాడు. ఆలీ త్వరలోనే జనసేనలో తీర్థం పుచ్చుకుంటరని జోరుగా ప్రచారం జరిగింది. కాగా పవన్ కళ్యాన్, ఆలీ మంచి స్నేహితులనే సంగతి మనకు తెలిసిందే.
తను నటించిన సినిమాలో ఆలీ లేకపోతే తనకు ఏదో లోటుగా ఉంటుంది అని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన ఆడియో పంక్షన్‌లలో చెబుతుంటాడు. తాను నటించే సినిమాలో ఖచ్చితంగా ఏదో ఒక రోల్ ఆలీకి ఉండేలా పెట్టుకుంటానని పలు ఇంటర్వులల్లో కూడా చెప్పాడు. తాజా రాజకీయ నేపథ్యంలో ఆలీ ఇలాంటి వ్యాఖ్యాలు చేయడంపై రాజకీయా నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది.