గురువారం ఏపీ సీఎం జగన్‌తో టాలీవుడ్ హీరో నాగార్జున భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన జగన్‌తో కలిసి లంచ్ చేశారు. ఈ సమావేశంలో నాగార్జునతో పాటు సినీ నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై నాగ్ చర్చించారు. అయితే సినీ రంగానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఈ సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చినట్టు సమాచారం.
సినిమా ఇండస్ట్రీ సమస్యలపై కొంతకాలంగా టాలీవుడ్ పెద్దలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఈనేపథ్యంలో నాగార్జున.. జగన్‌తో ఏం చర్చించారనేది ఆసక్తికరంగా మారింది. భేటీ ముగిసిన తర్వాత ఏం మాట్లాడరనే అంశంపై నాగార్జున వివరాలు వెల్లడించలేదు. అయితే హైదరాబాద్ వెళ్లే ముందు ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడిన నాగార్జున… విజయవాడ రావడం ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్ తన శ్రేయోభిలాషి అని.. ఆయన్ను కలిసి చాలా రోజులు అవుతోందని అందుకే వచ్చానన్నారు. ఇద్దరం కలిసి లంచే చేశామన్న నాగార్జున.. ఏం చర్చించారనే వివరాలను మాత్రం చెప్పలేదు.