ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సామి సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. జనాలు తన గురించి ఏమనుకుంటున్నారనే విషయాలను తాను అస్సలు పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. అద్నాన్ సామి మాట్లాడుతూ పూర్తి నేపథ్యం తెలియకుండానే సోషల్ మీడియాలో జనాలు ఎంత వేగంగా ఒక ముగింపునకు వచ్చేస్తారోనని ఆవేదన వ్యక్తం చేశారు.
నేను ఒక స్వేచ్ఛా జీవిని…అదృష్టవశాత్తూ నా మనసులో ఎలాంటి ఫిల్టర్లు లేవు. నా మనసుకు నచ్చింది నేను చేస్తాను. నేను దేవుడికి తప్ప మరెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా నాతో మంచితనంతో ఉంటే, వారు ఎవరైనా సరే నేను కూడా వారితో మంచితనంతోనే ఉంటాను. వేరొకరి అభిప్రాయాలను బట్టి నేను ఎవరినీ అంచనా వేయను. ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి నాకు ఏమీ తెలియనప్పుడు వారి గురించి నేను అస్సలు తప్పుగా అనుకోను. కాబట్టి నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అని తేల్చి చెప్పారు.
సోషల్ మీడియా సంస్కృతిని తప్పుబడుతూ.. జనాలు కేవలం పైపైన చూసి అబద్ధపు అంచనాలకు వచ్చేస్తున్నారని అద్నాన్ అన్నారు. నేను పెట్టిన ఒకే ఒక్క ఫోటో లేదా నా ఒక పాటను చూసి, నేను ఎలాంటి వాడినో, నా వ్యక్తిత్వం ఏంటో నిర్ణయించవచ్చని వాళ్ళు అనుకుంటే.. వాళ్ళు ఒక భ్రమల ప్రపంచంలో బతుకుతున్నట్లే. నన్ను ట్రోల్ చేసే వారిలో ఎక్కువ మంది నా అభిమానులు కాదు, వాళ్ళు కేవలం నెగెటివిటీని ప్రచారం చేయడానికే అక్కడ ఉంటారు అని ఆయన పేర్కొన్నారు.
గత ఫిబ్రవరిలో అద్నాన్ సామి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో కలిసి లంచ్ చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ ఫోటోలతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారితో ఒక అద్భుతమైన మధ్యాహ్నం గడిపాను. ఆయన మాట్లాడుతుంటే వినడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన గురించి సమాజంలో ఉన్న ఎన్నో అపోహలను ఆయన ఎంతో చక్కగా వివరించి, తొలగించారు. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి మరియు గొప్ప ఆత్మ… అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీయడమే కాకుండా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు కారణమైంది.
Also Read:పొగాకు లంగ్స్‌కే కాదు..!

