తమిళ్ బిగ్‌బాస్ ఫేమ్ నటి యాషిక ఆనంద్ కారు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైయారు. తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా మామల్లపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యషికా సహా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో యషిక స్నేహితురాలైన హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వల్లిశెట్టి భవాని అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన యషికతోపాటు మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం చెన్నై తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యషిక పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
వల్లిచెట్టి భవానీ (28) మృతదేహాన్ని మమల్లాపురం పోలీసులు స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందేమో అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. బిగ్‌బాస్ షోతో ఫేమస్ అయిన యషిక మోడల్‌గానూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె తమిళ చిత్రసీమలో నటిస్తోంది.