రూమర్స్ నమ్మకండి: శారద

188
sharadha
- Advertisement -

సౌత్ లో అభిమానుల మనసులో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న సీనియర్ నటి శారద. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శారద..ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. అయితే తాజాగా ఆమె అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు వైరల్‌గా మారగా ఈ వార్తలపై స్పందించారు శారద.

తాను చెన్నైలోని ఇంట్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాపై వస్తున్న తప్పుడు వార్తలు అవాస్తవం అని తెలిపారు. దీంతో నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆమె మరణవార్త అవాస్తవమని తేలిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు సినిమాల్లోనే కాకుండా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన శారద ప్రస్తుతం సినిమాల నుంచి విరామం తీసుకున్నారు.

‘ఇద్దరు మిత్రులు’, ‘ఆత్మబంధువు’, ‘దాగుడు మూతలు’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు, శారద జంట ‘మానవుడు-దానవుడు’, ‘దేవుడు చేసిన పెళ్ళి’, ‘శారద’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. 1996లో టీడీపీ తరపున తెనాలి నుండి ఎంపీగా ఎన్నికయ్యారు శారద.

- Advertisement -