వెండితెరపై వందలాది చిత్రాలలో తనదైన హాస్యంతో, నటనతో ప్రేక్షకులను నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుత పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తీవ్రమైన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమె.. నిన్న రాత్రి నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పావలా శ్యామల, నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆమె చికిత్స నిమిత్తం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అయితే, అత్యవసర వైద్యానికి సరిపడా డబ్బులు ఆమె వద్ద లేకపోవడంతో, ఆసుపత్రి యాజమాన్యం మరియు వైద్యులు ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించినట్లు సమాచారం.
కనీసం మానవత్వం కూడా చూపకుండా ఆసుపత్రి సిబ్బంది ఆమెను పంపించివేయడంతో, నిస్సహాయ స్థితిలో ఆమె రోడ్డుపైకి వచ్చారు. తీవ్రమైన గుండెనొప్పి, నీరసంతో నడవలేని స్థితిలో ఉన్న ఆమె అర్ధరాత్రి సమయంలో కూకట్‌పల్లి పరిధిలోని ఒక జంక్షన్ వద్ద ఉన్న ఫుట్‌పాత్‌పై పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆమె ఎవరో గుర్తుపట్టి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె పరిస్థితిని చూసి చలించిపోయారు. అర్ధరాత్రి సమయం కావడంతో ఆమెకు తక్షణ ఆశ్రయం, వైద్య సదుపాయం కల్పించేందుకు చొరవ తీసుకున్నారు. అనంతరం పోలీసుల పర్యవేక్షణలో ఆమెను సురక్షితంగా ‘ఆర్కే ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థకు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ సంరక్షణలో ఉన్నారు.
Also Read:తిలక్ వర్మపై అర్ష్‌దీప్ కామెంట్?
సినిమాల్లో నటించి ఎంతోమందిని అలరించిన ఒక సీనియర్ నటి, వృద్ధాప్యంలో వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక ఇలా రోడ్డుపై పడి ఉండటం చూసి సినీ అభిమానులు, స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) గానీ, ప్రభుత్వం గానీ స్పందించి ఆమెకు శాశ్వత వైద్య, ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.

