తనను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించారు అని పబ్లిక్ గా మీడియా ముందే బహిర్గతపరిచి మలయాళ హీరో దిలీప్ జైలుకు వెళ్ళేదాకా తెచ్చిన హీరొయిన్ భావన పెళ్లి చేసేసుకుంది. గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న కన్నడ నిర్మాత నవీన్ కు భావనకు త్రిసూర్ లోని ఓ దేవాలయంలో వంద మంది పోలీస్ సెక్యూరిటీ మధ్య నిరాడంబరంగా పెళ్లి జరిగింది. కేరళ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న భావన జంట స్థానికంగా ఉన్న ఆడిటోరియంలో పెళ్ళికి వచ్చిన అతిధులకు విందు ఇచ్చారు. అదే సాయంత్రం ఇండస్ట్రీ మిత్రులకు. కుటుంబ స్నేహితులకు లులు కన్వెన్షన్ సెంటర్ లో మరో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నారు. గత సంవత్సరమే పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పటికీ వివాదం ఇంకా పూర్తిగా చల్లారకపోవడంతో వాయిదా వేసుకున్న భావన చివరికి మిసెస్ అయ్యింది.
తెలుగు సినిమాలు కూడా కొన్ని చేసిన భావన కృష్ణ వంశీ మహాత్మా లో శ్రీకాంత్ సరసన చెప్పుకోదగ్గ పాత్ర చేసింది కాని అది ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడంతో కన్నడ వైపు వెళ్లిపోయింది. అక్కడి అగ్ర హీరోలదరి సరసన సినిమాలు చేసిన భావన తమిళ్ లో సైతం అజిత్ లాంటి హీరోలతో చెప్పుకోదగిన సినిమాలు అక్కడ కూడా చేసింది. స్వతహాగా మలయాళీ అయిన భావనకు ఈ రెండు బాషల్లోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది. కిడ్నాప్ – లైంగిక వేధింపు గురించి బాహాటంగా చెప్పి నిందితులు కోర్ట్ దాకా వచ్చేలా చేసిన భావన అప్పటి నుంచి బయట కనిపించడం మానేసింది. మళ్ళి ఇప్పుడు పెళ్లితో వార్తల్లోకి వచ్చింది.
అయితే భావన పెళ్లి సందర్బంగా పెళ్లికి కొన్ని గంటల ముందు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆమె పెళ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రియాంక ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో భావనను గొప్ప మహిళ, ధైర్యవంతురాలిగా కొనియాడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నీకు పెళ్లి సందర్భంగా శుభాకాంక్షలు. నీ జీవితంలో కొత్త అడుగు వేయబోతున్నావ్. అందుకు నీకు గుడ్‌లక్. నువ్వొక అమేజింగ్ ఉమెన్. నువ్వంటే నాకు చాలా గౌరవం’ అని ప్రియాంక వీడియోలో పేర్కొంది.