తమిళనాడు రాజకీయాల్లోకి సినీ నటుడు విశాల్ రంగప్రవేశం చేశారు. ఆర్‌కే నగర్ ఉపఎన్నికలో పోటీచేయనున్నట్లు ఆయన మీడియా ద్వారా ప్రకటించారు. సోమవారంనాడు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. తన రాజకీయ ప్రవేశానికి కారణం ప్రస్తుతం చెప్పనప్పటికీ నామినేషన్ పత్రాల దాఖలు అనంతరం వెల్లడిస్తానని చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగానే ఉపఎన్నికలో తలపడనున్నట్లు పేర్కొన్నారు. సినీరంగంలోని అవినీతిని విశాల్ బహిరంగంగానే ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.
అయితే మాజీ సీఎం జయలలిత మరణించడంతో ఖాళీ అయిన ఆర్‌కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 21న పోలింగ్ జరుగనుంది. డీఎంకే అభ్యర్థిగా మరుదుగణేశ్, అన్నాడీఎంకే అభ్యర్థిగా ఇ.మధుసూదన్, స్వతంత్ర అభ్యర్థిగా అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్ బరిలో ఉన్నారు. సంక్షోభంలో ఉన్న తమిళనాడు రాజకీయాలు ఆర్‌కే నగర్ ఉపఎన్నిక ఫలితంలో కీలక మలుపు తీసుకుంటాయని అంతా భావిస్తున్న తరుణంలో హీరో విశాల్ కూడా పోటీకి దిగుతుండటం మరింత ఉత్కంఠ రేపుతోంది. తెలుగు ఓటర్లు అధికంగా వున్న ఈ నియోజకవర్గం నుంచి తాను కూడా పోటీ చేయాలని విశాల్ నిర్ణయించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు.
కానీ రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయాల్లోకి వస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో కోలీవుడ్ ‘పందెంకోడి’ విశాల్ అనూహ్యంగా తెరపైకి వచ్చి బరిలోకి దూకేశారు. ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, తర్వాత ముందుకు దూకెయ్యడం ఆది నుంచి విశాల్ మనస్తత్వం. నడిగర్ సంఘం ప్రధానకార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సినిమా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా, కొన్నేళ్లుగా అభిమాన సంఘాల ద్వారా, తన తల్లి పేరు మీద ఏర్పాటుచేసిన ట్రస్టు తరపున పేదలకు, ఆపన్నులకు సాయం చేస్తున్నారు. అటు నడిగర్ సంఘం, ఇటు నిర్మాతల మండలిలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన సీనియర్లు, ఉద్దండ సినీ ప్రముఖుల్ని ఎదిరించి ఎన్నికల్లో విజయాలు సాధించారు. ఆ స్ఫూర్తితో అదే మార్పు నినాదంతో ఆర్‌కేనగర్‌లో బరిలోకి దిగేందుకు విశాల్ నిర్ణయించుకున్నారు. 2 రోజులపాటు శ్రేయోలాభిలాషులు, రాజకీయ సన్నిహితులతో చర్చిం చాకే ఈ ప్రకటన చే సినట్లు తెలుస్తోంది.