జాతీయ ఫిల్మ్ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటి సురేఖ సిఖ్రి (75) గుండెపోటుతో నిన్న మరణించారు. సురేఖా సిక్రి తుదిశ్వాస విడిచినట్లు ఆమె మేనేజర్ తెలిపారు. ఆమె కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. మూడేళ్ల క్రితం షూటింగ్ సమయంలో బాత్రూంలో సురేఖ సిఖ్రి జారిపడడంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అనంతరం కోలుకున్నప్పటికీ రెండేళ్ల తర్వాత మరోసారి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది.
సురేఖ సిఖ్రి 1988లో ‘కిస్సా కుర్సి కా’ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించారు. మమ్మో, బధాయ్ హో సినిమాలకు ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తెలుగులోకి డబ్ అయిన తర్వాత సురేఖ సిఖ్రి తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యారు. సురేఖ సిఖ్రి చివరిసారిగా ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్ అనే సినిమాలో నటించారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
బాలికా వధు హిందీ టీవీ సీరియల్ ఓ బిగ్గెస్ట్ హిట్. ఆ సీరియల్‌ను తెలుగులో చిన్నారి పెళ్లికూతురు పేరుతో ప్రసారం చేశారు. సురేఖా సిక్రి ఆ సీరియల్‌లో కీలక పాత్ర పోషించారు. బాలికా వధు సీరియల్‌లో దాదిసాగా సురేఖ నటించిన తీరు అసాధారణం. విభిన్న పార్శ్వాల్లో ఆమె తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆమె పర్ఫార్మెన్స్‌కు టీవీ ప్రేక్షకులు థ్రిలయ్యేవారు.
ఇక సురేఖా సిక్రి ఉత్తరప్రదేశ్‌లో సిక్రీ జన్మించారు. ఆమె తండ్రి వైమానిక దళంలో చేశారు. ఆమె తల్లి టీచర్. 1971లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు. 2018లో ఆమెకు పక్షవాతం వచ్చింది. అయితే ఆమె వీల్‌చైర్‌పై వచ్చి బదాయి హో చిత్రానికి అవార్డును అందుకోవడం గమనార్హం. ఇవాళ గుండెపోటుతో దాదిసా సురేఖా సిక్రి కన్నుమూశారు.