తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఓ వెలుగు వెలిగారు యాక్షన్ హీరో సుమన్. ఆయన నటించిన చాలా సినిమా యాక్షన్ సినిమాలు కావడం విశేషం. మంచి హైట్.. అందులోను మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం కలిగి ఉండడంతో ఆరంభం నుంచి యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చారు. 80వ దశకంలో స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో అనుకోని కారణాల వల్ల రెండు సంవత్సారాలు జైలు గోడల మధ్య గడిపారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు… తన కెరియర్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో తనను తెలుగు తెరకు పరిచయం చేసింది భానుచందర్ అంటూ చెప్పుకొచ్చారు. నేను.. భానుచందర్ ఓ తమిళ సినిమాలో కలిసి నటించాం. ఆ సినిమాలో నేను హీరో అయితే భాను విలన్. ఈ సినిమా సమయంలోనే భాను నాకు పరిచయం అయ్యాడు. అదే క్రమంలో తెలుగు సినిమాల్లో ట్రై చేయమని భాను సలహా ఇచ్చాడని చెప్పాడు.
తెలుగు పరిశ్రమలో నీవు తప్పకుండా రాణిస్తావని ప్రోత్సహించాడు. అప్పటికీ నాకు తెలుగు రాదని చెప్పాను.. అదే వస్తుంది లే నీవు అయితే ట్రై చెయ్య్ అని భాను ధైర్యం చెప్పాడు. అలా తెలుగులో ‘తరంగిణి’ అనే తొలి సినిమాతోనే పెద్ద హిట్ అందుకున్నానని సుమన్ చెప్పుకొచ్చారు.