సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా. ఈ చిత్రం ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కానీ కర్ణాటకలో మాత్రం కాలాపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. కావేరీ జల వివాదానికి ‘కాలా’కు సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు.
రజనీకాంత్ కావేరి జలాల విషయంలో చేసిన వ్యాఖ్యలు బాధించాయని చెప్పారు. కానీ ప్రతి విషయంలో ఫిలిం ఇండస్ట్రీని లాగుతున్నారన్నారు. కాలా విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటాయా..? లేక పద్మావతి సినిమా విషయంలో బీజేపీ ప్రభుత్వం చేసిన మాదిరిగానే చేస్తాయా..? అంటూ వ్యాఖ్యలు చేశారు. కావేరి సమస్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో పరిష్కారం చూపించాలని కోరారు.
ఇక కన్నడిగులకు కావాల్సింది సినిమా నిషేధించడమా..? అయినా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు సినిమా నిర్మాతలను బాధపెట్టడం సరికాదన్నారు. థియేటర్లలో క్యాంటీన్లు నడిపేవారు, రోజూ సైకళ్లపై తిరుగుతూ పోస్టర్లు అతికించేవారి జీవితాలు ఏమైపోవాలి? అంటూ ప్రశ్నించారు.
నేను ఇలా ప్రశ్నించడంతో డిబేట్లు పెట్టి నేను కన్నడిగుల వ్యతిరేకిని అంటూ ప్రచారం చేస్తారు. గతంలోనూ నా అభిప్రాయాన్ని వెల్లడించినందుకు నన్ను హిందువుల వ్యతిరేకిగా మార్చేశారని తెలిపారు. అయినా నేను చెప్పేది చెప్పాను మిగతాది మీ విజ్ఞతకి వదిలేస్తున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నారు.