ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మంచి మనసు చాటుకున్నారు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించే ప్రకాశ్ రాజ్ ఇప్పటికే కొండారెడ్డిపల్లె అనే గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. తన ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఆయన ఓ ప్రతిభావంతురాలైన విద్యార్థినికి ఆర్థిక సాయం చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తిగిరిపల్లి సిరి చందన అనే విద్యార్థిని పోస్టు గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉండగా, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ప్రకాశ్ రాజ్ దృష్టికి వచ్చింది. దాంతో ఆయన సిరి చందన విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చారు. సిరి చందనను ఆర్థికంగా ఆదుకుని ఆమె కుటుంబంలో సంతోషం నింపారు. ఇప్పుడు ప్రకాశ్ రాజ్ చలవతో ఆమె తన పీజీ కోసం యూకేకు వెళుతోంది.
ఈ సందర్భంగా సిరిచందన మాట్లాడుతూ,‘నాపేరు తిగిరిపల్లి సిరిచందన. మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెద్దేవం గ్రామం. నేను డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి మాంచెస్టర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సాలోఫోర్డ్‌లో సీటు వచ్చింది. నాకు తొమ్మిదేళ్ల వయసున్నపుడు మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మే కష్టపడి మమ్మల్ని చదివించి ఇక్కడి దాకా తీసుకువచ్చింది. యూనివర్సిటీలో సీటు వచ్చినప్పుడు అక్కడికి వెళ్లేందుకు నేను ధైర్యం చేయలేదు. ఎందుకంటే మా కుటుంబం పరిస్థితి నాకు తెలుసు కాబట్టి. నరేంద్ర అనే మా శ్రేయోభిలాషి ఒకరు నా గురించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినప్పుడు, ప్రకాశ్‌రాజ్ గారు చది చూసి తనకు నేను హెల్ప్ చేస్తాను. తను బాగా చదువుకోవాలని అని ముందుకు వచ్చారు. అన్ని ఖర్చులు ఆయనే భరిస్తున్నారు. ఆయన ఇచ్చిన ప్రేరణతో నేను బాగా చదువుకొని, నాలాంటి స్థితిలో ఉన్న మరో నలుగురికి సాయం చేయాలని అనుకుంటున్నా. నిజానికి మాంచెస్టర్ యూనివర్సిటీలో చదువుకొనే స్థాయి మాకు లేదు. కానీ ఆర్థికంగా, నైతికంగా ప్రకాశ్‌రాజ్ ఇచ్చిన సపోర్ట్ ఎన్నపటికీ మరిచిపోలేం. బుక్స్ దగ్గర నుంచి కంప్యూటర్ దాకా ఆయనే సమకూర్చి పెట్టారు. కచ్చితంగా ఈ విషయంలో ఆయనను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాను. ఎప్పటికీ ఆయనకు రుణపి ఉంటాను’ అని చెప్పింది.