డ్రగ్ కేసులో సినీ నటుడు నవదీప్ సోమవారం నాడు సిట్ అధికారుల ముందుకు హజరయ్యాడు. ఇప్పటికే ఆయనకు సిట్ నుండి నోటీసులు అందాయి. డ్రగ్స్ వ్యవహారంలో నవదీప్ విచారణ చాలా కీలకమైనదని సిట్ భావిస్తోంది. గతంలో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన నవదీప్ పేరు డ్రగ్స్ వ్యవహారంలో మార్మోగిపోయింది. నవదీప్‌కు గచ్చిబౌలిలో ఓ పబ్ ఉందని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పబ్‌లో డ్రగ్స్ విక్రయించేవారనే సమాచారాన్ని గుర్తించినట్టు అంటున్నారు. బీపీఎం పబ్ లో నవదీప్ భాగస్వామి అని, కెల్విన్ లాగే నవదీప్ కూడా ఈవెంట్ మేనేజర్ అని తెలుస్తోంది.దేశ విదేశాల్లో నవదీప్ ఈవెంట్లు నిర్వహిస్తుంటాడని, అతని పబ్ లోకి ఎవరికి పడితే వారికి ఎంట్రీ ఉండదని, రేవ్ పార్టీలు కూడా జరుగుతుంటాయని వస్తున్న ఆరోపణలపై సిట్ అధికారులు మరిన్ని కీలక విషయాలు తెలుసుకోనున్నారు.
అయితే నోటీసులు అందుకొన్న సమయంలోనే తనకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని నవదీప్ మీడియాకు చెప్పారు. సిట్ అధికారులకు తనకు తెలిసిన సమాచారాన్ని ఇస్తానని ఆయన ప్రకటించారు. కెల్విన్‌తో కూడ సంబంధాలు లేవని ఆయన ప్రకటించారు. ఈ కేసులో నవదీప్‌ను విచారించేందుకుగాను సిట్ అధికారులు ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించినట్టు సమాచారం. ఈవెంట్ మేనేజర్ గా డ్రగ్ డీలర్లతో ఎలా డీల్స్ చేసుకుంటారు? ఎవరెవరు ఈ దందాలో ఉన్నారు? గోవా నుంచే డ్రగ్స్ వస్తాయా? ఇతర మార్గాల ద్వారా చేరుతుంటాయా? డ్రగ్స్ ను ఎవరు ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు? డ్రగ్స్ తీసుకుంటారనే విషయాన్ని ఎలా నిర్ధారించుకుంటారు? వంటి వివరాలన్నీ నవదీప్ నుంచి సిట్ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. దీంతో నవదీప్ విచారణ చాలా కీలకమైనదని, సుధీర్ఘ విచారణ జరిగే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.
అదేవిధంగా టాలీవుడ్‌లో ఎవరెవరూ డ్రగ్స్ తీసుకుంటారన్న సమాచారం నవదీప్‌కు తెలిసే ఉంటుందని సిట్ భావిస్తోంది.. డ్రగ్స్ సరఫరా విషయంలో కూడా నవదీప్ ప్రమేయం ఉన్నట్టు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.. శనివారం తరుణ్‌ని 13 గంటలపాటు విచారించిన సిట్ అధికారులు.. నవదీప్‌ను కూడా అంతే సుధీర్ఘంగా విచారించనున్నారు.. డ్రగ్స్ వాడకం ముఖ్యంగా పబ్బుల్లోనే ఎక్కువగా జరగడం.. నవదీప్ పబ్బులో వాటా ఉండడంతో ఈ కేసులో నవదీప్ విచారణ కీలకం కానుంది..