నామినేషన్‌ వేస్తున్నా.. మా ఎన్నికలపై మంచు విష్ణు లేఖ..

126
Actor Manchu Vishnu
- Advertisement -

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ఉత్కంఠ భరితంగా మారిన విష‌యం తెలిసిందే. తాజాగా మా అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌ల్లో పోటీపై మంచు విష్ణు ఈ రోజు లేఖ రాసి ప‌లు వివ‌రాలు చెప్పారు. తాను కూడా ‘మా’ అధ్యక్ష బరిలో ఉన్నానని, నామినేషన్‌ వేస్తున్నానని హీరో మంచు విష్ణు ప్రకటించారు. సినీ పరిశ్రమను నమ్మిన కుటుంబంలో పుట్టానని, తెలుగు సినిమాతోనే పెరిగానని చెప్పారు. ‘మా’ ఎన్నికల్లో పోటీపై మంచు విష్ణు లేఖ విడుదల చేశారు. ‘మా’ కుటుంబ సభ్యుల భావాలు, బాధలు తనకు బాగా తెలుసునని ఆ లేఖలో పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు తమ కుటుంబం ఎంతో రుణపడి ఉందని చెప్పారు. పరిశ్రమ రుణం తీర్చుకోవడం, సేవ చేయడమే తన కర్తవ్యమని ప్రకటించారు.

‘మా’ అధ్యక్షుడిగా తన తండ్రి మోహన్‌బాబు చేసిన సేవలే తనకు స్ఫూర్తి అని వెల్లడించారు. ‘మా’ భవనం ఖర్చులో 25 శాతం ఇస్తానని గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. పెద్దల అనుభవాలు, యువరక్తంతో నడవాలనేదే తన ప్రయత్నమని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందామని సూచించారు. కాగా, మా అధ్యక్ష ప‌ద‌వి కోసం ఈ పోటీలో హీరో మంచు విష్ణుతో పాటు సినీ నటులు ప్రకాశ్ రాజ్‌, జీవితా రాజశేఖర్‌, హేమ కూడా నిలబడుతున్నట్టు ప్రకటించడంతో ఈ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి.

- Advertisement -