‘కురుప్’ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది..

80
- Advertisement -

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘కురుప్‌’. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ తెరకెక్కించారు. శోభిత కథానాయిక. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీ వేస్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో నవంబర్‌ 12న విడుదల కానుంది. కురుప్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బుధవారం దుల్కర్ సల్మాన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

తెలుగు ఇండస్ట్రీని నేను కొత్త ఇండస్ట్రీగా చూడటం లేదు. నన్ను ఇక్కడి వాళ్లు అంగీకరించారు. ప్రేమిస్తున్నారు. నాకు ఇక్కడ రానా, అఖిల్ వంటి స్నేహితులున్నారు. వైజయంతీ బ్యానర్ నాకు ఫ్యామిలీ వంటిది. నా ప్రతీ సినిమా ఇక్కడకు వస్తుందని చెప్పలేను. కానీ ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందుకే విడుదల చేస్తున్నాం. నటుడిగా ఎక్కువ మందికి దగ్గరవ్వాలనేది నా లక్ష్యం.

డైరెక్టర్, నా జర్నీ ఒకేసారి మొదలైంది. నా డెబ్యూ ఆయనతోనే జరిగింది. అప్పుడే కురుప్ సినిమా చేయాలని అనుకున్నారు. ఈ కథ ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆ ఘటన మీద ఎన్నో వార్తలు వచ్చాయి. మొత్తం క్రైమ్ నేపథ్యంలో కాకుండా అతని బాల్యం, యవ్వనంలో ఏం జరిగిందనేది కూడా చూపిస్తున్నాం. సినిమాను ఎలా చెప్పబోతోన్నామనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

ఇది కిల్లర్ స్టోరీ. ఇందులో మేం అతడిని హీరోలా చూపించలేదు. నేను బ్యాడ్ గాయ్ పాత్రలోనే కనిపిస్తాను. అతని వల్ల ఎన్ని కుబుంబాలు బాధపడ్డాయో చూపించాం. చివరకు ఏ సందేశామన్నది ఇచ్చామో చూడండి.

కురుప్ గురించి మేం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అలా ఉండే వాడు.. ఇలా ఉండే వాడు అని చాలా విషయాలు విన్నాం. ఎక్కువగా లైమ్ లైట్‌లో ఉండేందుకు ఇష్టపడేవాడు.. ఎంజాయ్ చేయడం, జల్సాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. అతడి గురించి ఎన్నో విషయాలు అప్పట్లో పేపర్లో వచ్చింది. వాటిని రిఫరెన్స్‌గా తీసుకుని పాత్రను పోషించాను.

ఇది ఏ జానర్ అనేది చెప్పడం కష్టం. ఇందులో అన్ని రకాల జానర్లు ఉంటాయి. యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్, బయోపిక్ ఇలా ప్రతీ ఒక్క జానర్ ఉంటుంది.

ఈ చిత్రాన్ని మేం థియేటర్లో విడుదల చేసేందుకు తీశాం. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం భారీ ఎత్తున నిర్మించాం. అలానే సినిమాను థియేటర్లోనే విడుదల చేస్తున్నాం. ఓటీటీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే ఈ సినిమాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ, ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించింది. ఇక ఈ చిత్రం వర్కవుట్ అయితే వరుసగా సినిమాలు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి.

కరోనా ఫస్ట్ లాక్ డౌన్ తరువాతే సినిమాను షూటింగ్ చేశాం. గత ఏడాది నవంబర్‌లో షూట్ చేశాం. ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారని, బయటకు రావడం వెళ్లడం ఇబ్బంది, ప్రమాదం అని ఆలస్యంగా మొదలుపెట్టాను. అప్పటికింకా వ్యాక్సినేషన్ ప్రారంభం కాలేదు. ఎందుకు రిస్క్ అని నవంబర్ వరకు ఆగాం. అందుకే నవంబర్ నుంచి షూటింగ్ చేశాం.

సినిమా మీద నమ్మకం ఉంది. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందుకే ఇంత భారీగా నిర్మించాం. భారీగానే విడుదల చేస్తున్నాం.

తెలుగులో సినిమాలు చేస్తే మంచి కథలే ఎంచుకోవాలని అనుకున్నాను. మహానటి వంటి ఒక్క చిత్రం చాలు. మంచి సినిమా చేశాడు అని ప్రేక్షకులు అనుకుంటారు. గుర్తు పెట్టుకుంటారు. అందుకే నేను చాలా సెలెక్టివ్‌గా తెలుగు సినిమాలను ఎంచుకుంటున్నాను. ఇప్పుడు హను రాఘవపూడి, వైజయంతీ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాను. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది విడుదల కానుంది. యుద్ద నేపథ్యం, ప్రేమ కథతో ఆ సినిమా ఉండబోతోంది.

థియేటర్లో సినిమాను చూసిన ఫీలింగ్ వేరు ఉంటుంది. ఓటీటీలో చూసే ఫీలింగ్ వేరు ఉంటుంది. ఓటీటీలో అయితే ప్రయోగాలు చేసే ఆస్కారం ఉంటుంది.

మా నాన్నకు ఈ కథ చెప్పాను. ఇంకా ఆయన సినిమా చూడలేదు. మేం ఎక్కువగా సినిమాల గురించి చర్చించుకోం. ఒకరి స్క్రిప్ట్‌లో మరొకరం తలదూర్చం. అభిప్రాయాలు మాత్రం తెలుకుంటూ ఉంటాం. ఇది ఎలా ఉందని ఆయన అడుగుతుంటారు. నేను కూడా నా స్క్రిప్ట్‌ల గురించి అడుగుతాను.

- Advertisement -