శంకర్ సినిమా కోసం ఇల్లు అమ్మేశా-అర్జున్

232
Action King arjun

తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ కింగ్ అర్జున్ అప్పట్లొ మంచి విజయాలను అందుకున్నారు. తమిళ్ హీరో అయినప్పటికీ  తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పర్చుకున్నారు. ఆయన నటించిన హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రావేచలి, శ్రీమంజునాథ వంటి చిత్రాలు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అనంతరం హీరోగా అవకాశాలు తగ్గడంతో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ప్రతినాయకుడి నటించిన అభిమన్యుడు మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.

Action King arjun And Director Shankar

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన సినీ అనుభవాలను పంచుకున్నారు. ఒకానొక సమయంలో వరుస పరాజయాలు పలకరించాయని, ఆ సమయంలో తన నుంచి నిర్మాతలు తప్పించుకుని తిరిగే వారని చెప్పారు. ఇక లాభంలేదని భావించి తానే స్వయంగా ఓ చిత్రానికి నిర్మాతగా మారానని, ఆ సినిమా కోసం ఓ ఇల్లును అమ్ముకున్నానని తెలిపారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు, మంచి వసూళ్లూ రాబట్టిందని అన్నారు. ఆ విజయంతో మళ్లీ నిర్మాతలు తనతో సినిమా చేయడానికి క్యూ కట్టారని చెప్పారు.

అయితే నేను ఖాళీగా ఉన్నప్పుడు మొఖం చాటేసి, ఒక హిట్ పడగానే మళ్లీ వస్తారని అందరినీ వెళ్లగొట్టేవాడినని, అదే క్రమంలో ఓ కుర్రాడు తన దగ్గరికి నాలుగు సార్లు వచ్చాడని తనని తిరిగి పంపించేశానని చెప్పారు. మరోసారి వచ్చి కథ వినకుండా వెళ్లమనడం కరెక్ట్ కాదు సార్.. ఒకసారి వినండి.. నచ్చపోతే వెళ్లిపోతానని చెప్పాడు. వినేసి నచ్చలేదని చెప్పొచ్చులే అనుకుని విన్నానని.. కానీ ఆ కథ నచ్చడంతో ఇల్లు అమ్మి ఆ సినిమాను తానే నిర్మించానని చెప్పుకొచ్చారు.

ఆ కుర్రాడు చెప్పిందే జెంటిల్ మేన్ స్టోరీ. ఆ కుర్రాడే శంకర్ అంటూ చెప్పారు. వీళ్లిదరి కలయికలో వచ్చిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని, భారీ మొత్తంలో కలెక్షన్స్ రాబట్టింది. అర్జున్ కెరీర్ లోనే బిగ్ హిట్ మూవీగా నిలిచింది. తన సినిమాతో శంకర్ చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం గర్వంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్లలో శంకర్ ఒకరు. ఆయన ప్రస్తుతం రజనీ కథానాయకుడిగా  2.0 సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.