పీటర్ హెయిన్స్… పరిచయం అక్కర్లేని పేరు. గౌతమ్ మీనన్ `చెలి`తో ఫైట్ మాస్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో `మురారి`తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత `అపరిచితుడు`, `శివాజీ`, `గజిని`, `మగధీర`, `రోబో`, `విలన్`, `విక్రమ సింహ`, `బాహుబలి`, `మన్యం పులి`…ఇలా ఆయన చేసిన సినిమాల లిస్టు చాలా పెద్దది. కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్లలోనే సౌత్ ఇండియాతో పాటు, బాలీవుడ్ సినిమాలకు యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసి ఓ బ్రాండ్‌గా ఎదిగారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కేటగిరీని తొలిసారి జాతీయ అవార్డుల్లో పొందుపరిచినప్పుడు, ఆ ఘనతను సొంతం చేసుకున్న యాక్షన్ డైరక్టర్‌గా ఆయన పేరు నమోదైంది.
పీటర్ హెయిన్స్ `స్టార్ట్… కెమెరా… యాక్షన్` అని మెగాఫోన్ పట్టుకుంటారని ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరక్టర్‌గా తన డ్రీమ్ డెబ్యూ గురించి చాన్నాళ్లుగా ఆయన కూడా ప్రస్తావిస్తూనే ఉన్నారు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. పీటర్ హెయిన్స్ కలను సాకారం చేయడానికి నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ముందుకొచ్చారు.
లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై `లక్ష్మీ`, `లక్ష్యం`, `రేసు గుర్రం`, `ముకుంద`… ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన నిర్మాత నల్లమలుపు బుజ్జి. తాజాగా తమ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ సంస్థలో పీటర్ హెయిన్స్ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బేబి భవ్య సమర్పిస్తున్నారు.
ఈ చిత్రం గురించి నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ “ పీటర్ హెయిన్స్ చెప్పిన కథ వినగానే నచ్చింది. కథ టేకాఫ్ అయ్యే విధానం నుంచి ప్రతిదీ ఎక్స్ ట్రార్డినరీగా అనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను. హీరో, హీరోయిన్ తో పాటు ఇతర ఆర్టిస్టులను ఎంపిక చేయాలి. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను. చిత్రాన్ని దసరాకు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తాం. మా బ్యానర్‌లో మరో మంచి సినిమా వస్తుందని గర్వంగా చెప్పగలను“ అని అన్నారు.