రిటర్నింగ్ అధికారి ఆదేశాలు చట్టవిరుద్దం!

3
- Advertisement -

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి (RO) తీసుకున్న నిర్ణయం 2+2=7 అని చెప్పినట్లుగా ఉందని కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ఎద్దేవా చేశారు. ఈ ఉత్తర్వు చట్టబద్ధంగా చెల్లదని ఇది కేవలం పొరపాట్లపై ఆధారపడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

న్యూఢిల్లీలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఎన్నికల సంఘం (EC) అధికారులను కలిసిన అనంతరం సింఘ్వీ మీడియాతో మాట్లాడారు. రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఆదేశాలు చట్ట విరుద్ధమని…ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని వివరించడానికి తాము వివరణాత్మక చట్టపరమైన ఆధారాలను సమర్పించామని ఆయన తెలిపారు.

రిటర్నింగ్ అధికారి ఒక చట్ట విరుద్ధమైన ఆదేశాన్ని జారీ చేశారని మేము ఎన్నికల సంఘానికి స్పష్టంగా వివరించాము. మా పరంగా ఇందులో ఎటువంటి సందేహాలకు తావు లేదు. ఆయన ఇచ్చిన తీర్పు ‘2+2=4’ అనడానికి బదులు ‘2+2=7’ అని రాసినట్లుగా ఉంది అని సింఘ్వీ పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, వివేక్ తంఖా, దిగ్విజయ్ సింగ్, భూపేష్ బఘేల్ మరియు మీనాక్షి నటరాజన్‌లతో కూడిన కాంగ్రెస్ నేతల ప్రతినిధి బృందం ఎన్నికల సంఘం అధికారులను కలిసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ‘సెక్షన్ 33A’ ను ప్రస్తావించారు. ఒక కోర్టు అధికారికంగా చార్జీలు దాఖలు చేసి ఆ నేరానికి రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న సందర్భాల్లో మాత్రమే అఫిడవిట్‌లో ఆ వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సింఘ్వీ తెలిపిన వివరాల ప్రకారం.. రిటర్నింగ్ అధికారి ప్రస్తావించిన కేసు ఇంకా కోర్టు పరిగణనలోకి కూడా రాలేదు.ఇక చార్జీలు దాఖలు చేయడం చాలా దూరం. నటరాజన్‌కు కోర్టు నుండి కేవలం ఒక నోటీసు మాత్రమే వచ్చింది. ఈ కేసును ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదో వివరించాలని మాత్రమే అందులో ఉంది. అంటే కోర్టు ఆ కేసును స్వీకరించడానికి ముందే ఆ నోటీసు జారీ చేయబడింది. కోర్టు పరిగణనలోకి తీసుకోనంత వరకు చట్టం దృష్టిలో అసలు క్రిమినల్ కేసే ఉనికిలో ఉండదు అని ఆయన వాదించారు.

చట్టం ప్రకారం అఫిడవిట్‌లో వెల్లడించాల్సిన అవసరం లేని ఒక ప్రాథమిక దశలోనే నామినేషన్‌ను తిరస్కరించారని ఈ నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమని కాంగ్రెస్ నేత వాదించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అభ్యర్థులు సుదీర్ఘమైన చట్టపరమైన పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండా రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 324’ ప్రకారం ఎన్నికల సంఘం తన అధికారాలను ఉపయోగించి తక్షణమే ఈ తప్పును సరిదిద్దాలని ఆయన కోరారు. నామినేషన్ పత్రాలను తప్పుగా తిరస్కరించిన కేసుల్లో ఎన్నికల సంఘం జోక్యం చేసుకున్న హర్యానా, గుజరాత్ ఉదాహరణలను కూడా సింఘ్వీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Also Read:విమల్ కృష్ణ..’అనుమాన పక్షి’

- Advertisement -