ఆవులకు కూడ ఆధార్ కార్డులు..!

322
- Advertisement -

ఇక నుండి మనుషులకే కాదు ఆవులకూ ఇకపై ఆధార్‌ అందుబాటులోకి రానుంది. దేశంలోని ప్రతి ఒక్కరికీ 12 అంకెల ఆధార్ కార్డు ఉన్నట్లుగానే ఆవులకు కూడా ఓ నంబర్‌ను (యూనిక్ ఐడెంటిఫికేషన్) కేటాయించేందుకు కేంద్రం ప్రయత్ని స్తున్నది. తొలుత ఈ ప్రతిపాదనను 2015లో తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఈసారి బడ్జెట్‌లో రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులతో మొదటిదశలో నాలుగు కోట్ల ఆవులకు నంబర్లు కేటాయిస్తారు.

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ (యూఐడీ) టెక్నాలజీని సమకూర్చుకున్నదని డెయిరీ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం అత్యంత చవకైనదని.. ఆవుకు సంబంధించిన జాతి, వయస్సు, లింగం, ఎత్తు, శరీర గుర్తులు వంటి వివరాలతో కూడిన టాంపరింగ్‌కు అవకాశం లేని ట్యాగ్ ఉంటుందన్నారు. ఒక్కో కార్డుకు రూ.8 నుంచి రూ.10 వరకు వ్యయం అవుతుందన్నారు. పశుసంజీవిని పేరుతో చేపట్టే ఈ ప్రాజెక్టు డెయిరీ, ఫిషరీస్ రంగంలో అతిపెద్దదని పేర్కొన్నారు.

cow

2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలనే ల క్ష్యాన్ని చేరుకోవాలంటే డెయిరీ రంగం చాలా కీలకమని కేంద్రం భావిస్తున్నది. చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు వ్యవసాయంతోనే ఆదాయం సాధించలేరని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లతో చేపలపెంపకం, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి నిధి, పశుసంవర్ధక మౌలికవసతుల అభివృద్ధి నిధిని ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. పశుజాతుల అభివృద్ధి, కృత్రిమ గర్భధారణ, పశుఅభివృద్ధి కోసం రూ.200 కోట్లను కేటాయించారు. ప్రతిపాద నలకు అనుగుణంగా 4 కోట్ల పశువులకు ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయిస్తే పాల ఉత్పత్తి 20 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అత్యధిక జన్యు యోగ్యత కలిగిన పాడిపశువుల సృష్టికి 15 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల 15 శాతం వృద్ధితోపాటు పాల ఉత్పత్తి విలువ రూ.15 వేల కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాగా పశువుల అక్రమ రవాణాను నిరోధానికి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం 2015లో నియమించిన కమిటీ సిఫారసుల మేరకు యూఐడీ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కింద పశువులను రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత వాటి యజమానులదే. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పశువులను చట్టబద్ధంగా విక్రయిస్తే.. హక్కులు దాని తర్వాత యజమానికి ట్రాన్స్‌ఫర్ అవుతాయి.

- Advertisement -