ఒకప్పుడు పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తారు.కాలం మారుతున్న కొద్ది పెళ్లి తంతు మారుతూ వస్తుంది.మరి ఇప్పటి తరం వారు మాత్రం అబ్బయి మంచి వాడై మంచి ఉద్యోగం,ఆస్తిపాస్తులు ఉంటే చాలు అనుకుంటున్నారు.కాని ఇప్పుడు చాల వరకు అన్‌లైన్ పెళ్లి చూపులు కావడంతో కొన్ని చోట్ల తప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తున్నారు.దాని వల్ల కొందరు రెండేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.అందుకోసం ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి ఇక ఆధార్ తప్పనిసరి చేసింది రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ. మ్యారేజ్ టైంలో వధూవరుల వేలి ముద్రలూ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయబోతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పెళ్లిళ్లను డిజిటలైజ్ చేయబోతోంది. ఇందులో భాగంగా, వధూవరుల వివరాలు, ఆధార్ నంబర్లు, వేలిముద్రలను తీసుకోనుంది. దీంతో రిజిస్టర్ పద్ధతిలో జరిగే రెండో పెళ్లిళ్లకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఆయా మతాచారాల ప్రకారం విభిన్న పద్ధతుల్లో బయట జరిగే వివాహాలకు ఈ విధానం వర్తించదు. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం పెళ్లిళ్లలను రికార్డ్ చేస్తున్నారు.
వీటిలో రెండు రకాల వివాహ సేవలను అందిస్తున్నారు. వధూవరులు వచ్చి తమకు పెళ్లి చేయాలని కోరితే.. నెల రోజుల గడువులో పెళ్లి చేసి వారికి ధ్రువీకరణ పత్రం ఇవ్వడం మొదటిది. దరఖాస్తులు చేసిన వారికి వివాహ ధ్రువీకరణ పత్రాలను అందజేయడం రెండోది. ఎవరైనా బయట వివాహం చేసుకుని… తమకు మ్యారేజీ సర్టిఫికెట్ కావాలని దరఖాస్తు చేసుకుంటే… వారికి ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తుంది. స్వదేశీ అమ్మాయిలు, అబ్బాయిలు, విదేశీ అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి చేసుకుని తమకు మ్యారేజీ సర్టిఫికెట్లు కావాలని కోరితే.. వారికి స్పెషల్ మ్యారేజీ యాక్టు కింద ధ్రువీకరణ పత్రాలను ఇస్తారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియలు ప్రస్తుతం మాన్యువల్‌గా జరుగుతున్నాయి. దరఖాస్తులను కాగితాలపై తీసుకుని, రిజిస్టర్‌లో వారి వివరాలు నమోదు చేస్తున్నారు. దీంతో ఒక అబ్బాయిగానీ, అమ్మాయిగానీ రెండో వివాహం చేసుకుంటే పట్టుకోవడం కష్టంగా ఉంటోంది. కొంత మంది రెండు మూడు సార్లు రిజిస్టర్ మ్యారేజీలు చేసుకుంటున్నా పట్టుబడడం లేదు. అందుకే ఆన్‌లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది.
అయితే ఇక నుండి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లో భాగంగా వధూవరులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ అయిన ‘registrat-ion.telangana.gov.in’ లో దరఖాస్తు చేసుకుంటే… వారి వివరాలన్నింటినీ అందులో పొందుపరుస్తారు. వధూవరుల ఫొటోలు, వేలిముద్రలను తీసుకుని ఆన్‌లైన్‌లోనే భద్రపరుస్తారు. సాక్షుల ఆధార్, వేలి ముద్రలు కూడా తీసుకుంటారు. వాటన్నిటినీ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేస్తారు. ఈ విధానాన్ని త్వరలో అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నారు.