రివ్యూ : ఏ1 ఎక్స్‌ప్రెస్‌

898
A1 Express Review
- Advertisement -

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రల్లో డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌కిషన్‌ , దయా పన్నెం కలిసి నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా.. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మధ్య సరైన విజయాలు లేక సతమతమవుతోన్న సందీప్ కిషన్ ఈ సినిమాతో ఏలాగైనా హిట్ కొట్టాలనీ కసిగా ఉన్నాడు. ఇందుకు సందీప్ కిషన్ ఓ స్పోర్ట్స్ బ్యాగ్ గ్రౌండ్‌ను ఎంచుకున్నాడు. ఇక ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ టీజర్‌లు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ అయిన ‘నట్పె తునై’కు తెలుగు రీమేక్‌గా వస్తోంది. అక్కడ ఈ సినిమా తమిళ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. మరి తెలుగులో ఎలా ఉందో.. తెలుగు వారు ఎంతవరకు ఆదరిచారో చూద్దాం..

కథ:

సందీప్ (సందీప్ కిషన్).. హాకీ ప్లేయర్ అయిన లావణ్య (లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి కోసం యానాంలోని తన మావయ్య ఇంటికొస్తాడు. నెమ్మదిగా ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమలోకి దించుతాడు. లావణ్య ఆట పరంగా కష్టం వస్తే తనకు సాయం చేసే క్రమంలో సందీప్ కూడా హాకీ క్రీడాకారుడే అన్న విషయం బయటపడుతుంది. అండర్-21 స్థాయిలో అతను ఇండియన్ కెప్టెన్ అని తెలుస్తుంది. ఓ బలమైన కారణంతో ఆటను మధ్యలో వదిలేసిన అతను.. మళ్లీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తిరిగి హాకీ స్టిక్ పట్టుకోవాల్సి వస్తుంది. గతంలో అతనెందుకు ఆట వదిలేశాడు.. మళ్లీ ఎందుకు ఆటలోకి వచ్చాడు అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ పాత్రకు సూటయ్యాడు. అతను మైదానంలో ఉన్నపుడు ఆటగాడిలాగే కనిపించాడు. ఆ మేరకు ఆటపై అవగాహన పెంచుకుని.. బాడీ మార్చుకుని.. అవసరమైన బాడీ లాంగ్వేజ్ కూడా చూపించాడు. అతడి కష్టం తెరపై కనిపిస్తుంది. సందీప్ నటన ఓకే కానీ.. ప్రతి సన్నివేశంలోనూ అవసరానికి మించి ఆత్మవిశ్వాసం చూపించడమే అతడికి బలహీనత మారిపోతోంది. దీని వల్ల నటనలో ఒక మొనాటనీ వస్తోంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాత్ర ఆరంభమైన తీరు చూసి ఏదో ఊహించుకుంటాం కానీ.. తర్వాత దాన్ని నామమాత్రం చేశారు. ఆమె నటన పర్వాలేదనిపిస్తుంది. గత సినిమాలతో పోలిస్తే లావణ్య కొంచెం ఎక్కువగా గ్లామరస్ గా కనిపించిందీ సినిమాలో. విలన్ పాత్రలో రావు రమేష్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన టిపికల్ యాక్టింగ్ తో తక్కువ సన్నివేశాల్లోనే ప్రభావం చూపించాడు. కోచ్ పాత్రలో మురళీ శర్మ ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి.. రాహుల్ రామకృష్ణలకు స్క్రీన్ టైం తక్కువైనా తమదైన ముద్ర వేయగలిగారు. సత్య.. మహేష్ విట్టా.. పోసాని కృష్ణమురళి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

మైనస్ పాయింట్స్‌:

ద్వితీయార్ధం నుంచి ‘ఎ1 ఎక్స్ ప్రెస్’కు ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్ మైనస్ అయింది. హీరో మధ్యలో ఆట వదిలేశాడు అంటే ఒక బలమైన కారణం ఉంటుందని అంచనా వేస్తాం. అందుకు తగ్గట్లే ఫ్లాస్ బ్యాక్ నడుస్తుంది. ప్రియదర్శి ఎపిసోడ్ హృద్యంగా అనిపించినప్పటికీ.. ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా అయితే అనిపించదు. ఇక వర్తమానంలోకి వస్తే.. హాకీ మైదానం ఉన్నచోట హాస్పిటల్ కట్టాలనుకోవడం.. దానికి వ్యతిరేకంగా కోచ్-ఆటగాళ్లు ఎదురు తిరగడం.. మ్యాచ్ గెలిస్తే గ్రౌండ్ మీదే అన్న ఛాలెంజ్.. ఆటలోకి తిరిగి రానే రానని భీష్మించుకున్న హీరో ఈ మ్యాచ్ కోసం రంగంలోకి దిగడం.. ఇవన్నీ కూడా చాలా రొటీన్ గా అనిపించే విషయాలు. ఏ కొత్తదనం కనిపించదు. ప్రేక్షకుల్లో ఒక ఎమోషన్ తెచ్చేలా ఈ సన్నివేశాలను డీల్ చేయడంలోనూ దర్శకుడు విఫలమయ్యాడు. చివరి 20 నిమిషాల్లో హాకీ మ్యాచ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు జస్ట్ ఓకే అనిపిస్తాయి తప్ప అంత ఉత్కంఠభరితంగా లేవు. ఆ సన్నివేశాలను వాస్తవికంగా కాకుండా లౌడ్ గా ప్రెజెంట్ చేయడం స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడేవాళ్లకు రుచించకపోవచ్చు. ఓవరాల్ గా చూస్తే.. ‘ఎ1 ఎక్స్ ప్రెస్’లో కొన్ని ఆసక్తికర మూమెంట్స్ అయితే ఉన్నాయి. దీనికి మంచి సెటప్ కూడా కుదిరింది. కానీ మనం ఇప్పటికే చూసిన కొన్ని స్పోర్డ్స్ డ్రామాల స్థాయిలో అయితే ఇదే అలరించలేకపోయింది. జస్ట్ అలా టైంపాస్ చేయడానికైతే ఈ సినిమా ఓకే.

సాంకేతిక విభాగం:

హిప్ హాప్ తమిళ సంగీతం తమిళ వెర్షన్ కు సరిపోయిందేమో కానీ.. తెలుగులో మాత్రం తేడాగా అనిపిస్తుంది. పాటల్లో.. బ్యాగ్రౌండ్ స్కోర్లో అరవ వాసనల వల్ల.. తమిళ సినిమా చూస్తున్న ఫీలింగే కలిగిస్తుంది. చాలా చోట్ల నేపథ్య సంగీతం.. బ్యాగ్రౌండ్ సాంగ్స్ మరీ లౌడ్ గా అనిపించి.. చికాకు పెడతాయి. అమిగో.. సింగిల్ కింగులం పాటలు ఓకే బాగానే అనిపిస్తాయి. కవిన్ రాజ్ ఛాయాగ్రహణం పర్వాలేదు. విజువల్స్ చాలా చోట్ల ఔట్ ఆఫ్ ఫోకస్ అనిపిస్తాయి. గేమ్ కు సంబంధించిన సన్నివేశాల్లో ఛాయాగ్రహణం ఉండాల్సిన స్థాయిలో లేదు. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు డెన్నిస్ జీవన్ కానుకొలనుకు యావరేజ్ మార్కులు పడతాయి. చాలా వరకు మాతృకనే ఫాలో అయిన అతను.. మన నేటివిటీకి తగ్గట్లుగా ఈ కథను నరేట్ చేయడంలో విజయవంతం కాలేకపోయాడు. మరీ తమిళ వాసనలు గుప్పుమనేలా సినిమాను డీల్ చేయడం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’కు ప్రతికూలంగా మారింది.

తీర్పు: లాక్‌ డౌన్‌ తర్వాత విడుదలైన ఎ1 ఎక్స్ ప్రెస్ కాస్త స్పీడు తగ్గింది అని చెప్పాలి.

విడుదల తేదీ:03/05/2021
రేటింగ్- 2.5/5
నటీనటులు: సందీప్ కిషన్-లావణ్య త్రిపాఠి
సంగీతం: హిప్ హాప్ తమిళ
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్-అభిషేక్ అగర్వాల్-సందీప్ కిషన్-దయ పన్నెం
దర్శకత్వం: డెన్నిస్ జీవన్ కానుకొలను

- Advertisement -